బీసీ ఏ వర్గీకరణపై మంత్రివర్గంలో చర్చిస్తాం
ముదిరాజులకు ప్రభుత్వంలో సముచిత భాగస్వామ్యం
ట్యాంక్‌బండ్‌పై పండుగ సాయన్న విగ్రహం ఏర్పాటు చేస్తాం
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం
కాకతీయ, కొడంగల్: ముదిరాజులను ప్రభుత్వంలో భాగస్వాములను చేసే బాధ్యత నాదేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ముదిరాజులను బీసీ డీ నుంచి బీసీ ఏకు మార్చే అంశంపై వచ్చే మంత్రివర్గ సమావేశంలో చర్చించి, మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి సమగ్రంగా అధ్యయనం చేయిస్తామని ప్రకటించారు. పండుగ సాయన్న జయంతి సభలో ఆయన మాట్లాడుతూ కొడంగల్ నియోజకవర్గంలో ముదిరాజుల జనాభా అత్యధికంగా ఉందని, వారు విశ్వసనీయమైన వారని పేర్కొన్నారు. నిజాం హయాంలో భూస్వాములు పేదల భూములను ఆక్రమిస్తుంటే పండుగ సాయన్న ఎదురుతిరిగి పేదలకు అండగా నిలిచారని, దొరలకు వ్యతిరేకంగా దళాన్ని ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. పేదలకు ధాన్యం పంచడంతో పాటు ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆర్థిక సాయం చేసిన ఘనత ఆయనదన్నారు. చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, పండుగ సాయన్నల చరిత్రను మరుగునపరిచారని, ట్యాంక్‌బండ్‌పై పండుగ సాయన్న, దొడ్డి కొమురయ్య విగ్రహాలను ఆవిష్కరిస్తామని తెలిపారు. వందేళ్ల తర్వాత తమ ప్రభుత్వం కులగణన చేపట్టిందని, లెక్కల ఆధారంగానే బీసీ కులాల హక్కులపై నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందన్నారు. కులగణనలో జనాభా వివరాలు తక్కువగా నమోదయ్యాయని భావించే వారు పూర్తి సమాచారం అందిస్తే సవరిస్తామని చెప్పారు. ముదిరాజులకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించే అంశాన్ని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ దృష్టికి తీసుకెళ్లాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌కు సూచించారు. గత ప్రభుత్వాల మంచి సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే రెట్టింపు సంక్షేమం అందిస్తున్నామని, 3.48 కోట్ల మందికి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. బహుజనుల జీవితాలు మెరుగుపడాలంటే రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి కావాలని, వచ్చే ఎన్నికల్లో ఆయనకు అండగా నిలవాలని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.

