తహసీల్దార్ సంతకం, ముద్ర ఫోర్జరీ
నకిలీ ఫ్యామిలీ సర్టిఫికెట్తో భూముల మ్యుటేషన్‌కు యత్నం!
కరీమాబాద్ మహిళపై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు
దర్యాప్తు చేపట్టిన ఏజే మిల్స్ కాలనీ పోలీసులు
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : భూముల మ్యుటేషన్ కోసం నకిలీ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ సృష్టించిన వ్యవహారం వరంగల్‌లో వెలుగుచూసింది. ధ్రువపత్రంపై ఖిలా వరంగల్ తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేయడంతో పాటు నకిలీ ముద్రను ఉపయోగించినట్లు తహసీల్దార్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కరీమాబాద్‌కు చెందిన మెహరున్నీసా బేగంపై ఏజే మిల్స్ కాలనీ పోలీసులు నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఎఫ్ఐఆర్ నంబర్ 780/2026తో అక్టోబర్ 17, 2026న రాత్రి 10 గంటలకు కేసు నమోదైంది. ఖిలా వరంగల్ తహశీల్దార్ ఎం.డి. ఇక్బాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు 318(4), 336(3), 340(2), 337 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ శివరాత్రి మహేష్ దర్యాప్తు చేస్తున్నారు. కరీమాబాద్‌కు చెందిన మెహరున్నీసా బేగం తన భర్త దివంగత మహమ్మద్ అబ్దుల్ రహీం పేరుతో ఉన్నట్లు పేర్కొంటూ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్‌ను ఆత్మకూరు తహసీల్దార్‌కు సమర్పించారు. సర్టిఫికెట్ నంబర్ సి/3223/2026, తేదీ 08-01-2026గా ఉంది. దీని ప్రామాణికతపై అనుమానం రావడంతో ఆత్మకూరు తహసీల్దార్ ఖిలా వరంగల్ తహశీల్దార్ కార్యాలయాన్ని వివరణ కోరారు.
జారీ చేయని ధ్రువపత్రం.. ఫోర్జరీ సంతకం?
ఖిలా వరంగల్ తహసీల్దార్ కార్యాలయంలోని రికార్డులు, పంపిణీ రిజిస్టర్‌ను పరిశీలించగా, 2026లో ఆ నంబరుతో ఎలాంటి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ జారీ కాలేదని తేలినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో సదరు ధ్రువపత్రం నకిలీదిగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. తహసీల్దార్ సంతకం, కార్యాలయ ముద్రను కూడా నకిలీగా ఉపయోగించినట్లు ఫిర్యాదులో వివరించారు. ఇతర వారసుల పేర్లను చేర్చకుండా నకిలీ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ సృష్టించి, ప్రధానమైన వ్యవసాయ భూములను తమ పేర్లపైకి మ్యుటేషన్ చేయించుకునేందుకు ప్రయత్నించినట్లు తహసీల్దార్ తన ఫిర్యాదులో ఆరోపించారు. ఈ వ్యవహారంలో జైనాబీ, మహమ్మద్ అబ్దుల్ రహీం, మెహరున్నీసా బేగం, మహమ్మద్ పర్వేజ్ పేర్లను ప్రస్తావించారు.
లోతుగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు
తహశీల్దార్ ఎం.డి. ఇక్బాల్ ఆర్సీ నంబర్ సి/2912/2026తో అక్టోబర్ 17న ఏజే మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ అధికారులకు లేఖ రాశారు. మెహరున్నీసా బేగం (ఇంటి నంబర్ 16-1-881, కరీమాబాద్)పై క్రిమినల్ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఈ ధ్రువపత్రం తయారీ వెనుక మరెవరైనా ఉన్నారా? ఇలాంటి నకిలీ పత్రాలు మరిన్ని సృష్టించారా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

