ప్రమాదవశాత్తు విద్యుతాఘాతంతో వ్యక్తి మృతి
కాకతీయ,రాయపర్తి : ఇంట్లో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగలడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన విషాదకర ఘటన వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో చోటుచేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఊకల్లు గ్రామానికి చెందిన నర్రా దేవేందర్(50) చేపలు పడుతూ జీవనం సాగిస్తున్నాడు.శుక్రవారం రాత్రి ఇంటి రేకులకు విద్యుత్ ప్రవాహం (కరెంట్) సరఫరా అవుతున్న విషయాన్ని గమనించకపోవడంతో,ప్రమాదవశాత్తు వాటిని తాకి విద్యుత్ షాక్ కు గురై కిందపడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేసి,స్థానికుల సహాయంతో అతడిని వర్ధన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.అయితే, అప్పటికే అతడు మృతి చెందినట్లు పరీక్షించిన వైద్యులు ధ్రువీకరించారు.సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వర్ధన్నపేట మార్చురీకి తరలించారు.


