గిరిజన విద్యార్థులకు క్రీడా పోటీలు
నవంబర్ 5 నుంచి మూడు డివిజన్లలో నిర్వహణ
14, 17 ఏళ్ల విభాగాల్లో బాలబాలికలకు పోటీలు
కాకతీయ, ములుగు : ములుగు జిల్లాలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో చదువుతున్న బాలబాలికలకు నవంబర్ 5 నుంచి డివిజన్ స్థాయి క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. 14, 17 ఏళ్ల వయో విభాగాల్లో పోటీలు నిర్వహించేందుకు ఏటూరునాగారం ఐటీడీఏ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం డిప్యూటీ డైరెక్టర్ దబ్బగట్ల జనార్దన్ ఆధ్వర్యంలో వ్యాయామ ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ ఆదేశాలు, ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో అనుమతి మేరకు ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. మూడో డివిజన్ పరిధిలోని వాజేడు, వెంకటాపురం ప్రాంతాల విద్యార్థులకు నవంబర్ 5, 6 తేదీల్లో లక్ష్మీనగర్ బాలుర ఆశ్రమ పాఠశాలలో పోటీలు జరుగుతాయి. మొదటి డివిజన్‌లోని ములుగు, వెంకటాపూర్, గోవిందరావుపేట, తాడ్వాయి మండలాలకు నవంబర్ 10, 11 తేదీల్లో మేడారం బాలికల ఆశ్రమ పాఠశాలలో, రెండో డివిజన్‌లోని ఏటూరునాగారం, మంగపేట, కన్నాయిగూడెం మండలాలకు నవంబర్ 12, 13 తేదీల్లో చిన్నబోయినపల్లి బాలుర ఆశ్రమ పాఠశాలలో పోటీలు నిర్వహిస్తారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, చెస్, క్యారం, టెన్నికాయిట్, ఆర్చరీ, అథ్లెటిక్స్ పోటీలు జరగనున్నాయి. డివిజన్ల కన్వీనర్లుగా పీఈటీలు చింత సతీష్, చింత రమేష్, పీడీ మల్లె నాగేందర్ వ్యవహరిస్తారు. సమావేశంలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఈరులాల్, ఐటీడీఏ స్పోర్ట్స్ ఆఫీసర్ ఆలం శ్యామలత, ములుగు స్పోర్ట్స్ ఆఫీసర్ యాలం ఆదినారాయణ, వ్యాయామ ఉపాధ్యాయులు ఎంజా సత్యనారాయణ, తోలెం సమ్మయ్య, మేకల కృష్ణ, బిజ్జా సునీత, చింత రమేష్, వంక రాంచందర్ పాల్గొన్నారు.

