సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు
వినతులపై నిర్లక్ష్యం వద్దు
అధికారులకు ఐటీడీఏ పీఓ ఆదేశం
కాకతీయ, ఏటూరునాగారం రూరల్ : గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి లెనిన్ వత్సల్ టోప్పో సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఏటూరునాగారం మండల కేంద్రంలో నిర్వహించిన గిరిజన దర్బార్లో వివిధ సమస్యలపై వినతులు స్వీకరించి పరిష్కారానికి సంబంధిత అధికారులకు పంపించారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, ఇంటి పట్టాలు, వైద్యశాఖ సమస్యలు, తాత్కాలిక సిబ్బందికి పెండింగ్లో ఉన్న వేతనాలు, అటవీ హక్కుల గుర్తింపు పత్రాలు, భూ సమస్యలపై వచ్చిన అర్జీలను పరిశీలించాలని సూచించారు. ఉద్యోగుల ఇతర ప్రాంతాలకు నియామకానికి సంబంధించిన వినతిని గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులకు పంపించారు. గోవిందరావుపేట మండలం దుంపెల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్మించిన మరుగుదొడ్లు, వంటగది భవనానికి సంబంధించిన బిల్లులు చెల్లించాలని, గతంలో జారీ చేసిన ఉత్తర్వు పత్రం పోయినందున కొత్త పత్రం మంజూరు చేయాలని వచ్చిన వినతులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాలాజీనగర్లో అజ్మీరా వీరన్న పొలం వరకు మట్టి రోడ్డు నిర్మాణం, కంకర మట్టి మంజూరు, 1,500 మీటర్ల మురుగు కాలువ నిర్మాణం చేపట్టాలని వచ్చిన అర్జీలను ఇంజినీరింగ్ అధికారులకు పంపించారు. అలాగే సంద్రగూడెం నుంచి రెండు పడక గదుల ఇళ్ల వరకు, బాలాజీనగర్ కూడలి వరకు మట్టి రోడ్డు నిర్మించాలని వచ్చిన వినతులను పరిశీలించాలని సూచించారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిష్కరించాలని ఎలాంటి జాప్యం లేకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పీఓ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి ప్రతాప్, పరిపాలన అధికారి అనిల్, గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు డి. జనార్ధన్, కార్యనిర్వాహక ఇంజినీరు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

