పట్టభద్రులంతా ఓటు హక్కును నమోదు చేసుకోవాలి
మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్
కాకతీయ, హనుమకొండ : ఉన్నత విద్యావంతులైన పట్టభద్రులంతా విధిగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ పిలుపునిచ్చారు. సోమవారం హనుమకొండలోని కాకతీయ డిగ్రీ కళాశాల ఆవరణలో బీఆర్ఎస్వీ కాకతీయ విశ్వవిద్యాలయ అధ్యక్షుడు, జిల్లా కోఆర్డినేటర్ బైరపాక ప్రశాంత్ ఆధ్వర్యంలో నిర్వహించిన పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులతో మాట్లాడిన వినయ్ భాస్కర్ అర్హులైన ప్రతి అధ్యాపకుడు గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు. ఓటరు నమోదు కోసం ఫారం-18ను అందజేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కుకు ఎంతో ప్రాధాన్యం ఉందని, త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు కావడం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. శాసనమండలిలో ఉన్నత విద్యావంతుల సమస్యలను వినిపించే గొంతుకగా పట్టభద్రుల ఎమ్మెల్సీ నిలుస్తారని, అందువల్ల ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవడంతోపాటు ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు వద్దిరాజ్ గణేష్, ఉడతల సారంగపాణి, జోరిక రమేష్, పశ్చిమ నియోజకవర్గ కోఆర్డినేటర్ పులి రజినీకాంత్, సీనియర్ నాయకులు దూలం వెంకన్న, రామ్మూర్తి, ఖలీల్, తక్కళ్లపల్లి వినీల్‌రావు, బీఆర్ఎస్వీ నాయకులు వీరస్వామి, కాకతీయ డిగ్రీ కళాశాల అధ్యాపకులు, బీఆర్ఎస్వీ బాధ్యులు, లీగల్ సెల్ బాధ్యుడు నాయిని రవి తదితరులు పాల్గొన్నారు.

