సీసీఐ మేల్కోవాలి.. పత్తి రైతును కాపాడాలి!
పత్తి రైతు కష్టాన్ని వ్యాపారుల లాభాలకు బలి చేయొద్దు
కమర్షియల్ పద్ధతిలో కొనుగోలు చేయాలి
ప్రైవేటు దళారుల చేతిలో రైతు దోపిడీ.. కేంద్రం జోక్యం చేసుకోవాలి
క్వింటాకు రూ.12 వేలు ఇవ్వాల్సిందే.. తెలంగాణ రైతు సంఘం హెచ్చరిక
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : పత్తి రైతుల కష్టాన్ని ప్రైవేటు వ్యాపారుల లాభాలకు బలి చేయవద్దని, తక్షణమే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) కమర్షియల్ పద్ధతిలో కొనుగోళ్లు చేపట్టాలని తెలంగాణ రైతు సంఘం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సిసిఐ వరంగల్ జనరల్ మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కన్వీనర్ సోమిడి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈ ఏడాది అనుకూల వాతావరణం లేక, సరైన వర్షాలు లేకపోవడంతో పత్తి దిగుబడి గణనీయంగా తగ్గిందని, ఎకరాకు వేల రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతుకు పెట్టుబడి కూడా రాని దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతును ఆదుకోవాల్సిన కేంద్రం తన బాధ్యతను విస్మరిస్తోందని విమర్శించారు. ప్రస్తుతం మార్కెట్లో ప్రైవేటు వ్యాపారులు యంఎస్ పి కంటే ఎక్కువ ధర ఇస్తున్నట్లు చెబుతూనే, కొందరి పత్తికి మాత్రమే ఎక్కువ ధర ప్రకటించి మిగతా రైతులను క్వింటాకు రూ.1000 నుండి రూ.2000 వరకు తక్కువకు కొని దోచుకుంటున్నారని మండిపడ్డారు. యంఎస్ పి కంటే ఎక్కువ ధర ఉన్నప్పుడు సిసిఐ ఎందుకు కమర్షియల్ పద్ధతిలో కొనుగోలు చేయడం లేదని, ప్రభుత్వ సంస్థలు ప్రేక్షక పాత్ర వహించడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. పత్తికి క్వింటాకు రూ.12 వేల ధర కల్పించాలని, నాణ్యత, తేమ పేరుతో ధరలు తగ్గించడంపై విచారణ జరిపాలని, పారదర్శక వేలం విధానం అమలు చేయాలని, అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రం స్పందించి సిసిఐ ద్వారా కొనుగోళ్లు చేపట్టకపోతే రైతులను ఐక్యం చేసి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఓదెల రాజయ్య, ఉపాధ్యక్షులు ఊరాటి అంశాలు రెడ్డి, కోశాధికారి సిరుల రవీందర్, కత్తి సుధాకర్, బొల్లి ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

