ప్రజల భద్రత కోసం పోరాడితే కేసులా?
భారీ వాహనాల నియంత్రణ కోరుతూ నిరసన చేపట్టాం
మడికొండ ప్రజల ప్రాణాల రక్షణే నా లక్ష్యం.. పోరాటం ఆగదు
బీజేపీ వరంగల్ జిల్లా కార్యదర్శి పోనగోటి వెంకట్‌రావు
కాకతీయ, హనుమకొండ : ప్రజల ప్రాణాల రక్షణ కోసం చేసిన పోరాటాన్ని నేరంగా పరిగణించడం బాధాకరమని మడికొండకు చెందిన బీజేపీ వరంగల్ జిల్లా కార్యదర్శి పోనగోటి వెంకట్‌రావు అన్నారు. మడికొండ నుంచి ధర్మసాగర్ వెళ్లే మార్గంలో భారీ వాహనాల రాకపోకలతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోందని, భారీ వాహనాలు గ్రామంలోకి ప్రవేశించకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ 2024 ఆగస్టు 1న అంబేద్కర్ విగ్రహం వద్ద గ్రామస్థులతో కలిసి నిరసన చేపట్టామని తెలిపారు. ఈ నిరసనపై నమోదైన కేసు విచారణకు హనుమకొండ జిల్లా కోర్టుకు హాజరయ్యామని పేర్కొన్నారు. కోర్టు విచారణ సందర్భంగా ఒక్కొక్కరు రూ.10,000 వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశించారని, తదుపరి విచారణను 2027 ఫిబ్రవరి 12కు వాయిదా వేశారని వెంకట్‌రావు తెలిపారు. తనతో పాటు బొల్లికొండ వినోద్, గడ్డం మహేందర్, ఎలగొండ శివ, మాచర్ల రంజిత్, చట్ల అజయ్, దువ్వ కిషన్ కోర్టుకు హాజరయ్యారని చెప్పారు. ప్రజల భద్రత కోసం గొంతెత్తిన వారిపై కేసులు పెట్టినా వెనుకడుగు వేయబోమని, భారీ వాహనాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణ కోసం తన పోరాటం నిరంతరం కొనసాగుతుందని పోనగోటి వెంకట్‌రావు స్పష్టం చేశారు.

