అమరుడు లక్ష్మణ్ గౌడ్ కుటుంబానికి అండగా ఉంటాం!
అమరవీరుల కుటుంబాలను ప్రభుత్వం విస్మరించడం బాధాకరం
లక్ష్మణ్ గౌడ్ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి
: ఓరుగంటి ఆనంద్, సుంకరి మల్లేశం గౌడ్
కాకతీయ, బచ్చన్నపేట : తెలంగాణ మలిదశ ఉద్యమంలో రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరుడు వేముల లక్ష్మణ్ గౌడ్ కుటుంబానికి అండగా ఉంటామని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ఓరుగంటి ఆనంద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకరి మల్లేశం గౌడ్ తెలిపారు. బుధవారం జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నే గ్రామంలో లక్ష్మణ్ గౌడ్ కుటుంబాన్ని పరామర్శించి, ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్రం ఏర్పడి ఇన్నేళ్లయినా అమరవీరుల కుటుంబాలకు తగిన న్యాయం జరగకపోవడం బాధాకరమని వారు అన్నారు. ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేకే కమిటీ వెంటనే నివేదిక సమర్పించాలని డిమాండ్ చేశారు. లక్ష్మణ్ గౌడ్ భార్యకు అర్హతను బట్టి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని, అర్హులైన ఉద్యమకారులకు పెన్షన్లు, ఇంటి స్థలాలు, ఉచిత వైద్యం, విద్యా సౌకర్యాలు అందించాలని కోరారు. అమరవీరుల కుటుంబాలకు, ఉద్యమకారులకు న్యాయం జరిగే వరకు ఫోరం పోరాటం కొనసాగిస్తుందని, అవసరమైతే మరో విడత ఉద్యమానికి సిద్ధమవుతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రచార కార్యదర్శి చిలువేరు రమేష్, జనగామ జిల్లా అధ్యక్షుడు నర్రా సంపత్, ప్రధాన కార్యదర్శి ముక్కెర కుమారస్వామి, కాజీపేట మండల అధ్యక్షుడు బస్కే రాజేందర్, వంగ విశ్వేశ్వరరావు, బస్కే రంజిత్, ఇమ్మడి వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.

