దుగ్గొండి బ్రాందీ షాపును సీజ్ చేయాలి
టాస్క్ఫోర్స్ సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్లపై విచారణ జరపాలి
నర్సంపేట ఆర్డీవోకు సీపీఐ (ఎంఎల్) నాయకుల వినతి
కాకతీయ, నర్సంపేట టౌన్ : దుగ్గొండి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రాందీ షాపులో అక్రమ మద్యం విక్రయాలు జరుగుతున్నాయనే ఆరోపణలపై వెంటనే చర్యలు తీసుకోవాలని సీపీఐ (ఎంఎల్) నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం నర్సంపేట ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు. ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని ఇతర మద్యం దుకాణాల నుంచి తక్కువ ధరకు మద్యం కొనుగోలు చేసి తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తున్నట్లు వారు ఆరోపించారు. ఎక్సైజ్ జిల్లా టాస్క్ఫోర్స్ అధికారులు తనిఖీల్లో అక్రమ మద్యం గుర్తించినప్పటికీ షాపు యాజమాన్యంపై కేసులు నమోదు చేయకుండా వెనుదిరిగారని విమర్శించారు. షాపు యాజమాన్యంతో అధికారులు కుమ్మక్కై ముడుపులు తీసుకున్నారనే ఆరోపణలపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరపాలని నాయకులు కోరారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రాందీ షాపును తక్షణమే సీజ్ చేయాలని, ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్లపై విచారణ జరిపి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. గిర్నిబావి, నర్సంపేట డివిజన్లోని ఇతర మండలాల్లోనూ ప్రత్యేక తనిఖీలు నిర్వహించి అక్రమ మద్యం విక్రయాలను అరికట్టాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ (ఎంఎల్) రాష్ట్ర నాయకులు కామ్రేడ్ మోడం మల్లేశం, కామ్రేడ్ భూమా అశోక్, కామ్రేడ్ అనిల్, బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

