బస్టాండ్ ఉన్నా తప్పని తిప్పలు
రోడ్డుపైనే ఆపుతున్న ఆర్టీసీ బస్సులు
ప్రమాదాల నీడలో ప్రయాణికులు
ఆర్టీసీ ఉన్నతాధికారులు స్పందించాలని ప్రయాణికుల డిమాండ్
కాకతీయ,రాయపర్తి : వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు.స్థానికంగా ప్రయాణ ప్రాంగణం (బస్టాండ్) ఉన్నప్పటికీ,ఆర్టీసీ బస్సులను లోపలికి తీసుకెళ్లకుండా పలువురు డ్రైవర్లు ప్రధాన రహదారిపైనే నిలుపుతున్నారు.రోజు ఇదే తంతు కొనసాగుతుందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.దీంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వరంగల్- ఖమ్మం జాతీయ రహదారిపై నిత్యం వేలాది వాహనాలు అత్యంత వేగంగా ప్రయాణిస్తుంటాయి.ఈ క్రమంలో రద్దీ ఎక్కువగా ఉండే రహదారిపైనే ఆర్టీసీ బస్సులను నిలిపి ప్రయాణికులను ఎక్కించుకోవడం,దింపడం చేస్తున్నారు.దింతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బస్సులో ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడిందని,ఏ క్షణంలో ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని స్థానికులు,ప్రయాణికులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.అంతేకాకుండా రోడ్డుపైనే బస్సులను ఆపడం వల్ల ఇతర వాహనాల రాకపోకలకు సైతం ఆటంకం కలుగుతుందని వాపోతున్నారు.

ఉన్నతాధికారులు స్పందించాలి : ప్రయాణికుడు గారె వినోద్
మండలంలో బస్టాండ్ ఆవరణం ఉండి కూడా బస్సులు లోపలికి రావడంలేదని స్థానిక నివాసి,ప్రయాణికుడు గారె వినోద్ గురువారం ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రధాన రహదారిపైనే బస్సులు ఆపడంతో వృద్ధులు,మహిళలు బస్సు ఎక్కడానికి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు.ఆర్టీసీ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి,ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని బస్సులను తప్పనిసరిగా బస్టాండ్ లోపలికి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

