ఆశాల సమస్యలు పరిష్కరించాలి
రేపటి కలెక్టరేట్ ధర్నాను జయప్రదం చేయండి…….
బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు పిలుపు…..
కాకతీయ, నర్సంపేట టౌన్: ఆశా వర్కర్ల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రేపు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిర్వహించనున్న ధర్నాలో ఆశా వర్కర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా ఆశా వర్కర్లకు నెలకు 18 వేల వేతనం చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్సీటీ టార్గెట్లను ఎత్తివేసి, జాబ్‌చార్ట్ ప్రకారం విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.ఆశా వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలను గత కొన్ని నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నప్పటికీ పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.
లేనిపక్షంలో డిసెంబర్ 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆశా వర్కర్లు విధులను బహిష్కరించి నిరవధిక సమ్మెకు దిగుతారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆశా వర్కర్లంతా ఐక్యంగా కదిలి రేపటి ధర్నాను విజయవంతం చేయాలని యువరాజు కోరారు.

