నిర్ణీత గడువులోగా సమస్యలు పరిష్కరించాలి
దరఖాస్తుదారులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలి
కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు ఆదేశం
కాకతీయ, ములుగు : ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని, నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అధికారులను హెచ్చరించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మొత్తం 22 దరఖాస్తులు అందాయి. వాటిలో భూ సమస్యలకు సంబంధించి 7, ఇందిరమ్మ ఇళ్ల కోసం 2, పింఛన్లకు 4, ఇతర శాఖలకు సంబంధించి 9 ఉన్నాయి. అర్జీల పరిష్కార స్థితిని దరఖాస్తుదారులకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని, పరిష్కారానికి అవకాశం ఉన్న వాటిని పెండింగ్లో పెట్టకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రాకుండా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సీహెచ్ మహేందర్ జి, ఎం. సంపత్రావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

