22న హనుమకొండకు కేటీఆర్..!
వరంగల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహణకు బీఆర్ఎస్ నిర్ణయం
ఏర్పాట్లపై నేతలతో సమీక్షించిన ప్రభుత్వ మాజీ చీఫ్‌విప్ దాస్యం వినయ్ భాస్కర్
కాకతీయ, హనుమకొండ : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) ఈ నెల 22న హనుమకొండకు రానున్నారు. ఆయన పర్యటన సందర్భంగా వరంగల్ నగరంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం బాలసముద్రంలోని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా కార్యాలయంలో ప్రభుత్వ మాజీ చీఫ్‌విప్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో గ్రేటర్ వరంగల్ పరిధిలోని మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. కేటీఆర్ పర్యటన, సభ నిర్వహణ ఏర్పాట్లపై నేతలు విస్తృతంగా చర్చించారు. జనసమీకరణ, ట్రాఫిక్ నియంత్రణ, వేదిక ఏర్పాటు, ఇతర నిర్వహణ అంశాలపై సమీక్షించి, వివిధ కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పార్టీలోకి కొత్త చేరికలపైనా చర్చించారు. వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పు, వర్ధన్నపేట, పరకాల, స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గాల నుంచి నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు భారీగా తరలిరానున్నట్లు వెల్లడించారు. సమావేశంలో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య, మాజీ ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, ఆరూరి రమేష్, మాజీ చైర్మన్లు నాగుర్ల వెంకన్న, మర్రి యాదవరెడ్డి, చింతం సదానందం, రమేష్‌బాబు, మాజీ కార్పొరేటర్లు వద్దిరాజ్ గణేష్, జోరిక రమేష్, సీనియర్ నాయకులు నిమ్మగడ్డ వెంకన్న, శోభన్, మసూద్, నయీమొద్దీన్, నీలం రాజ్‌కిషోర్, పోలపెల్లి రామ్మూర్తి, ఏకశిల విద్యాసంస్థల చైర్మన్ తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

