పార్టీ మారేది లేదు… కాంగ్రెస్‌లోనే కొనసాగుతాం..
కాకతీయ, వరంగల్ ప్రతినిధి: వరంగల్ జిల్లా తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మాజీ కార్పొరేటర్లు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భైరబోయిన ఉమా దామోదర్ యాదవ్, ఎలగం సత్యనారాయణ, ప్రవీణ్, బసవరాజ్ కుమార్, ఫుర్ఖన్, పల్లం పద్మ రవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సోషల్ మీడియాలో తాము పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండించారు. అవన్నీ పూర్తిగా అవాస్తవమని, తాము పార్టీ మారేది లేదని స్పష్టం చేశారు. టికెట్ ఇచ్చినా, ఇవ్వకపోయినా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతామని ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలందరూ సంక్షేమ, అభివృద్ధి ఫలాలతో సుభిక్షంగా ఉన్నారని, ఎన్నడూ లేని విధంగా పలు ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందుతున్నాయని వారు తెలిపారు.
తమతో ఎలాంటి సంప్రదింపులు జరపకుండా తమ ఫోటోలను ఉపయోగించి వార్తలు రాయడం ఎంతో బాధనిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పదవుల కోసం కాదు, ప్రజల సంక్షేమం కోసమే ప్రజాక్షేత్రంలో ఉంటామని, తమను ఇబ్బంది పెట్టడానికి కొందరు అధినాయకులను తమపైకి ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు.
ఎలాంటి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్‌ను వీడబోమని వారు పునరుద్ఘాటించారు.

