నిట్–కిట్స్ మధ్య బలోపేతమైన విద్యా బంధం
పునరుద్ధరించిన అవగాహన ఒప్పందంపై సంతకాలు
సంయుక్త పరిశోధనలు, విద్యార్థుల ఇంటర్న్‌షిప్‌లకు ప్రాధాన్యం
నిట్ వరంగల్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుధి, కిట్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. అశోక రెడ్డి
కాకతీయ, వరంగల్ బ్యూరో : విద్యా, పరిశోధనా రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత విస్తరించే లక్ష్యంతో నిట్ వరంగల్, కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (కిట్స్) వరంగల్ సంస్థలు గురువారం పునరుద్ధరించిన అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ భాగస్వామ్యంతో సంయుక్త పరిశోధనలు, సదస్సులు, అధ్యాపక అభివృద్ధి కార్యక్రమాలు, శిక్షణా తరగతులు, విద్యార్థుల ఇంటర్న్‌షిప్‌లు నిర్వహించనున్నారు. అధ్యాపకులు, విద్యార్థుల మార్పిడితో పాటు విద్యా, శాస్త్రీయ సమాచారాన్ని పరస్పరం పంచుకోనున్నారు.
రూ.88.71 లక్షల పరిశోధనా నిధులు.. 23 పత్రాలు
నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుధి మాట్లాడుతూ సంస్థల మధ్య సహకారం విజ్ఞాన మార్పిడి, నైపుణ్యాభివృద్ధికి దోహదపడుతుందన్నారు. కిట్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. అశోక రెడ్డి మాట్లాడుతూ గత ఒప్పందంతో వివిధ సంస్థల నుంచి రూ.88.71 లక్షల పరిశోధనా నిధులు సమకూరాయని, ప్రతిష్ఠాత్మక పరిశోధనా జర్నళ్లలో 23 సంయుక్త పరిశోధనా పత్రాలు ప్రచురితమయ్యాయని వెల్లడించారు. పునరుద్ధరించిన ఒప్పందం విద్యార్థులు, అధ్యాపకులకు ఉన్నత స్థాయి పరిశోధనలు, నూతన ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధికి మరిన్ని అవకాశాలు కల్పిస్తుందని ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు.

