ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు పెద్దపీట.. మానాలలో కొత్త పెన్షన్ల పంపిణీ..
– పేదల సంక్షేమమే ఇందిరాగాంధీ ఆశయం – మానాల మోహన్ రెడ్డి..
– ఏడెనిమిదేళ్ల నిరీక్షణకు తెర.. ఒంటరి మహిళలు, వితంతువులకు ఊరట..
– ఇందిరాగాంధీ జయంతి వేడుకల్లో ఘన నివాళులు.. లబ్ధిదారులకు ఆర్థిక భరోసా..
కాకతీయ, రుద్రంగి : రుద్రంగి: ఇందిరమ్మ రాజ్యం అంటే పేదల రాజ్యం.. బడుగు బలహీన వర్గాలు, దళిత, గిరిజన ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేసే పాలన అని రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాల గ్రామంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో గురువారం దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మానాల మోహన్ రెడ్డి ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆమె దేశానికి చేసిన సేవలను, పేదల సంక్షేమం కోసం అమలు చేసిన కార్యక్రమాలను స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. దేశ తొలి మహిళా ప్రధానిగా ఇందిరాగాంధీ భారతదేశ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారని కొనియాడారు. పేదలు, బడుగు బలహీన వర్గాలు, దళితులు, గిరిజనుల అభ్యున్నతే లక్ష్యంగా ఆమె అనేక సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని తెలిపారు. ముఖ్యంగా 20 సూత్రాల పథకం ద్వారా సమాజంలోని అట్టడుగు వర్గాలకు ప్రభుత్వ ఫలాలు అందించాలనే లక్ష్యంతో పనిచేశారని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం, సామాజిక సమానత్వం, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఆమె చేసిన కృషి చిరస్మరణీయమన్నారు.
ఇందిరాగాంధీ భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆమె ప్రవేశపెట్టిన పథకాలు, ప్రజా సంక్షేమం కోసం చేసిన సేవలు నేటికీ ప్రజల హృదయాల్లో నిలిచిపోయాయని అన్నారు. సుమారు నాలుగు దశాబ్దాల క్రితం ఆమె మరణించినప్పటికీ దేశ ప్రజలు ఇప్పటికీ ఆమెను స్మరించుకోవడం ప్రజల జీవితాలపై ఆమె చూపిన ప్రభావానికి నిదర్శనమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పేదల సంక్షేమానికి, అణగారిన వర్గాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ఇందిరాగాంధీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ప్రజా సంక్షేమం, గ్రామాభివృద్ధి దిశగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెర.. కొత్త పెన్షన్ల పంపిణీ..
ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని గ్రామంలో నూతనంగా మంజూరైన పెన్షన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. సుమారు ఏడెనిమిదేళ్లుగా పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులకు పెన్షన్లు మంజూరు కావడంతో లబ్ధిదారులకు ఆర్థిక భరోసా లభించనుంది. అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా అండగా నిలవడం ప్రజా సంక్షేమ పాలనలో కీలకమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. పెన్షన్లు అందడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేదలకు కొంత ఉపశమనం కలుగుతుందని తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ద్వారానే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని, మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్య సాధనకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని మానాల మోహన్ రెడ్డి సూచించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ బుర్ర శంకర్, ఉప సర్పంచ్ దాసరి అశోక్, పంచాయతీ కార్యదర్శి అనిల్, కాంగ్రెస్ పార్టీ జిల్లా జనరల్ సెక్రెటరీ తుమ్ జలపతి, జిల్లా కార్యదర్శి జక్కు మోహన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కొమ్ముల రవీందర్ రెడ్డి, జక్కు లింగారెడ్డి,జక్కుల శ్రీనివాస్, జక్కు వంశీ,తిక్క భూమయ్య, లక్కాకుల శ్రీనివాస్,చెదలు నవీన్, నాంచారి రాకేష్,జేలంధర్, క్యాతం గంగాధర్, లక్ష్మయ్య, అన్ని గ్రామాల సర్పంచ్ లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీగా పాల్గొన్నారు.

