ఈ-వ్యర్థాల నిర్వహణకు ప్రత్యేక కార్యాచరణ!
సేకరణ నుంచి తరలింపు వరకు ప్రతి దశపై పర్యవేక్షణ
సీడీఎంఏ డా. టి.కె. శ్రీదేవి ఆదేశం
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : నగరాల్లో ఈ-వ్యర్థాల నిర్వహణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి పకడ్బందీగా అమలు చేయాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ, కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (సీడీఎంఏ) డా. టి.కె. శ్రీదేవి మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. ఈ-వ్యర్థాల సేకరణ, వేరు చేయడం, తరలింపు, శాస్త్రీయ నిర్వహణపై గురువారం హైదరాబాద్ నుంచి తొమ్మిది మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి. వెంకన్న క్యాంపు కార్యాలయం నుంచి పాల్గొన్నారు.
మొబైల్ యాప్‌తో నిరంతర పర్యవేక్షణ
ఈ-వ్యర్థాల కోసం ప్రత్యేక సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసి, ప్రజలకు అందుబాటులో ఉండే ప్రాంతాలను గుర్తించి ప్రకటించాలని శ్రీదేవి సూచించారు. ఈ-వ్యర్థాలు, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి అధీకృత కేంద్రాలకు తరలించాలన్నారు. భారీగా వ్యర్థాలు ఉత్పత్తి చేసే సంస్థలను కాలుష్య నియంత్రణ మండలిలో నమోదు చేయించాలని ఆదేశించారు. తరలింపు ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రత్యేక మొబైల్ యాప్ రూపొందించి, స్వచ్ఛ ఆటో డ్రైవర్లను అనుసంధానించాలని సూచించారు. రోజువారీ చెత్త ఉత్పత్తి, సేకరణ, తరలింపు వివరాలను నమోదు చేయడంతో పాటు కేంద్రాలు, వాహనాలకు క్యూఆర్ కోడ్ విధానం అమలు చేయాలని దిశానిర్దేశం చేశారు. సమావేశంలో జీడబ్ల్యూఎంసీ సూపరింటెండింగ్ ఇంజనీర్ రాజ్‌కుమార్, ముఖ్య ఆరోగ్యాధికారి డా. రాజారెడ్డి, ఆరోగ్యాధికారి డా. రాజేష్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు రవికుమార్, సంజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

