ఎంజీఎంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ!
బెడ్షీట్లు ఎప్పటికప్పుడు మార్చాలి.. పరిశుభ్రత పాటించాలి
భద్రతా సిబ్బంది తీరుపై కలెక్టర్ డా. సత్య శారద అసహనం
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : ఎంజీఎం ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డా. సత్య శారద ఆదేశించారు. గురువారం ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించి వివిధ వైద్య విభాగాల్లో సేవలను పరిశీలించారు. నవజాత శిశు సంరక్షణ విభాగం, అసంక్రమిత వ్యాధుల చికిత్స వార్డు, వృద్ధుల సంరక్షణ విభాగం, పోషకాహార పునరావాస కేంద్రం, జిల్లా ప్రారంభ జోక్య కేంద్రాలను తనిఖీ చేశారు. వైద్య సేవలు, చికిత్సా విధానాలు, రికార్డులు, సిబ్బంది హాజరు వివరాలను పరిశీలించారు. రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. పేషెంట్ బెడ్షీట్లను ఎప్పటికప్పుడు శుభ్రమైన వాటితో మార్చాలని, వార్డులు, ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఆరోగ్య సూచికల్లో మెరుగైన ఫలితాలు సాధించేలా వైద్యులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలన్నారు. భద్రతా సిబ్బంది నిర్లక్ష్యంపై అసహనం వ్యక్తం చేస్తూ విధుల్లో నిబద్ధతతో, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ పర్యటనలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. బి. రాజారెడ్డి, ఎంజీఎం సూపరింటెండెంట్ డా. రామ్‌కుమార్ రెడ్డి పాల్గొన్నారు.

