అన్నా..నన్ను దేవుడే పంపిండు..
మీతో కలిసి పనిచేయమని…
మాజీ మంత్రి జీవన్‌రెడ్డి భావోద్వేగం
కేసీఆర్‌తో మాజీ మంత్రి కీలక భేటీ
కుటుంబ సభ్యులతో కలిసి ఎర్రవల్లికి..
ఫాంహౌస్‌లో స్వాగతం పలికిన నాయకులు
శాలువాతో సత్కరించిన మాజీ ముఖ్యమంత్రి
భవిష్యత్ కార్యాచరణతోపాటు రాజకీయ అంశాలు ఇరువురి చర్చ
నిన్న జగిత్యాలలోని జీవన్ నివాసానికి కేటీఆర్..
స్వయంగా పార్టీలోకి ఆహ్వానం
కాకతీయ, తెలంగాణ బ్యూరో: బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మాజీ మంత్రి టీ జీవన్ రెడ్డి శుక్రవారం ఎర్రవల్లి ఫాంహౌస్‌లో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈసందర్భంగా జీవన్‌రెడ్డి కేసీఆర్‌ను పలకరిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. ‘ అన్నా.. నన్ను దేవుడే పంపిండు. మీతో కలిసి పని చేయమని’ అంటూ కేసీఆర్‌ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఇటీవలే కాంగ్రెస్ పార్టీని వీడిన ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లుగా నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ ప్రకటన తర్వాత తొలిసారిగా కేసీఆర్‌తో భేటీ అయ్యారు. సమావేశంలో జీవన్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. కార్యక్రమంలో జీవన్ రెడ్డి కుటుంబ సభ్యులతోపాటు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భేటీ సందర్భంగా భవిష్యత్ కార్యచరణతో పాటు పలు రాజకీయ అంశాలు చర్చకు వచ్చినట్లుగా తెలిసింది.

జీవన్‌రెడ్డిని ఆహ్వానించిన కేసీఆర్
కాగా జీవన్ రెడ్డిని అనునయిస్తూ, అప్యాయంగా దగ్గరికి తీసుకున్న కేసీఆర్, శాలువాతో సన్మానించి పుష్పగుచ్ఛం ఇచ్చి ఆహ్వానించారు. భేటీ సందర్భంగా కేసీఆర్, జీవన్‌రెడ్డి మధ్య పలు రాజకీయ అంశాలు చర్చకు వచ్చినట్లుగా సమాచారం. ఈ సందర్భంగా ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి తొలిసారి వచ్చిన జీవన్ రెడ్డిని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్ రమణ, ఎమ్మెల్యే డా. కె.సంజయ్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే కె. విద్యాసాగర్ రావు, పార్టీ నేతలు గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి తదితరులు ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు.



నిన్న జీవన్ నివాసానికి కేటీఆర్
మాజీ మంత్రి జీవన్‌రెడ్డిని జగిత్యాలలోని నివాసంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీ నేతలతో కలిసి వెళ్లి స్వయంగా బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించారు. కేటీఆర్‌తో సమావేశం అనంతరం జీవన్‌రెడ్డి బీఆర్ఎస్‌లో చేరుతున్నట్లు కీలక ప్రకటన చేశారు. శేషజీవితంలో కేసీఆర్‌తో పనిచేసే అవకాశం వచ్చిందని, అందుకే బీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నానని ప్రకటించారు. బీఆర్‌ఎస్‌తో కలిసి పనిచేస్తే రాష్ట్ర భవిష్యత్‌కు పాటుపడవచ్చని జీవన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. 27 నెలలుగా చాలా క్షోభ అనుభవించానని, కాంగ్రెస్‌కు రాజీనామా చేసినప్పుడు భావోద్వేగానికి గురయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ కంటే మెరుగైన పాలన అందిస్తారని కాంగ్రెస్‌కు ఓటేశారని, కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో రాష్ట్రం తిరోగమన దిశలో నడిచిందని విమర్శించారు. 2014లోనే కేసీఆర్ నాయకత్వంలో పని చేసే అవకాశం వచ్చిందని, అయినా కాంగ్రెస్‌లోనే కొనసాగానని గుర్తు చేశారు. రాష్ట్ర అవసరాల కోసం ఇప్పుడు బీఆర్‌ఎస్‌తో కలిసి పని చేస్తానని ప్రకటించారు.
ఎమ్మెల్యే సంజయ్ రాకతో..
ఇటీవల జీవన్‌రెడ్డి తన అనుచరుల సమక్షంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. జగిత్యాలలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి డాక్టర్ సంజయ్ గెలిచారు. అప్పటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో ఆయన అధికార పార్టీతో కలిసి పని చేస్తానని బహిరంగంగా వెల్లడించారు. అక్కడే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన జీవన్ రెడ్డి ఓటమి చెందడం, ఆయనకు సమాచారం లేకుండా ఎమ్మెల్యే సంజయ్‌ని కాంగ్రెస్‌లో చేర్చుకోవడంతో జీవన్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై కాంగ్రెస్ అధిష్టానం పలుమార్లు నచ్చజెప్పింది. సంతృప్తి చెందని ఆయన రాజీనామా చేసిన సంగతి విధితమే.

