ఆర్టీసీ ఉద్యోగులకు
డీఏ 2.1 శాతం
ఈ ఏడాది జనవరి నుంచే అమలు
ఇంతకు ముందు 50.7 శాతం ..
తాజా పెంపుతో 52.8 శాతానికి..
సర్కార్‌పై రూ.2.82 కోట్ల అదనపు భారం
సహజ మరణానికి రూ. 10 లక్షల బీమా
ఏప్రిల్ 1 నుంచి ఈ నిర్ణయం అమలు
రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి
మంత్రిని కలిసిన ఆర్టీసీ ఉద్యోగులు
కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఉద్యోగుల డీఏను 2.1 శాతం పెంచుతున్నట్లు శుక్రవారం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. పెరిగిన డీఏ ఈ ఏడాది జనవరి నుంచే అమలు అవుతుందని స్పష్టం చేశారు. ఇంతకు ముందు ఆర్టీసీ ఉద్యోగులకు 50.7 శాతం డీఏ ఉండగా, తాజా పెంపుతో అది 52.8 శాతానికి పెరిగింది. దీంతో పెరిగిన డీఏ ద్వారా ఆర్టీసీ సంస్థపై ప్రతి నెలా రూ.2.82 కోట్ల అదనపు భారం పడనుంది. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు పెరిగిన డీఏను వరుసగా మూడు నెలలకు ఒక్కో నెలలో సప్లిమెంటరీ బిల్స్ ద్వారా ప్రభుత్వం ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయనుంది. గత సంవత్సరం (2025) జులైలో డీఏను 2.1 శాతం పెంచిన సంగతి తెలిసిందే. అప్పుడు 48.6 శాతం నుంచి 50.7 శాతానికి పెంచారు. డీఏ పెంపు సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేసి అభివృద్ధి కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టాలని సూచించారు.
ఉద్యోగులకు రూ. కోటి ప్రమాద బీమా
తమ ఉద్యోగులకు రూ.కోటి ప్రమాద బీమా పథకాన్ని అమలు ఆర్టీసీ చేస్తోంది. ఉద్యోగుల సామాజిక భద్రతను మరింత మెరుగు పరిచేందుకు సహజ మరణానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా రూ.10 లక్షల బీమా కల్పించనున్నట్లు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తెలిపారు. ఈ నిర్ణయం ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలతుందని తెలిపారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ)లో సాలరీ అకౌంట్ ఉన్న ఉద్యోగులకు ఈ బీమా వర్తిస్తుంది. ఈ నిర్ణయంతో సంస్థలో పనిచేస్తున్న దాదాపు 38 వేలకు పైగా ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భరోసా లభించిందని ఎండీ తెలిపారు.
పని భారం తగ్గిస్తాం
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులకు సంబంధించి పెండింగ్ ఉన్న ఏకైక డీఏను కూడా ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నాం. జనవరి 2026 నుంచి 2.1 శాతం డీఏను పెంచుతున్నాం. మొదటి నుంచి సంస్థ మూడు ప్రధాన అంశాలపై పని చేస్తుంది. కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యం, సంస్థ పరిరక్షణ-అభివృద్ధి. ప్రధానంగా సంస్థలో భాగస్వాములైన కార్మికుల సంక్షేమంపై వారికి సంబంధించిన ఆరోగ్య సంరక్షణకు ఆసుపత్రి అప్‌గ్రేడేషన్, కారుణ్య నియామకాలు, దీర్ఘ కాలంగా రిమూవ్ అయిన వారిని త్రిమెన్ కమిటీ ద్వారా తిరిగి విధుల్లోకి తీసుకోవడం, కొత్త నియామకాలు చేపట్టి ఉన్న కార్మికులపై పని భారం తగ్గించడం, కొత్త బస్సులు కొనుగోలు లాంటి అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. లైఫ్ లైన్ అయినటువంటి ఆర్టీసీని మరింత ముందుకు తీసుకువెళ్తున్నాంష అని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.

