సీతక్క జవాబు చెప్పు
కేసీఆర్‌కు లీగల్ నోటీసులెందుకు?
స్మార్ట్ ఫోన్ల కుంభకోణంతో ఆయనకు ఏం సంబంధం?
310 స్మార్ట్ ఫోన్ల కొనుగోలులో ముమ్మాటికీ అవినీతి
అంగన్వాడీ వర్కర్స్‌కు తక్కువ ధర స్మార్ట్ ఫోన్లు
రూ. 54 కోట్లకు టెండర్.. రూ. 24 కోట్లు మాత్రమే ఖర్చు
మిగిలిన రూ. 30 కోట్లు ఎక్కడికి పోయాయి?
బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ ధ్వజం
కాకతీయ, తెలంగాణ బ్యూరో : స్మార్ట్ ఫోన్ల కుంభకోణంలో కేసీఆర్‌కు ఎటువంటి సంబంధం ఉందని లీగల్ నోటీసులు పంపించారో మంత్రి సీతక్క సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ డిమాండ్ చేశారు. మంత్రి సీతక్క అంటే బీఆర్ఎస్ పార్టీకి గౌరవం ఉందన్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. 35 వేల 310 స్మార్ట్ ఫోన్ల కొనుగోలులో అవినీతి జరిగిందని మేం గత కొన్ని రోజులుగా తెలియజేస్తున్నాం అన్నారు. అంగన్వాడీ వర్కర్స్ కు స్మార్ట్ ఫోన్లు ఇస్తున్నామని పెద్ద పెద్ద ప్రకటనలు ఇస్తూ, తక్కువ ధరకు మొబైల్ కొనుగోలు చేసి ఇచ్చారని మరోమారు ఆరోపించారు. స్మార్ట్ ఫోన్ల కొనుగోలు టెండర్ రూ. 54 కోట్లకు పిలిచారని, 35 వేల 310 స్మార్ట్ ఫోన్లకు రూ. 24 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, మిగిలిన రూ. 30 కోట్లు ఎక్కడికి పోయాయో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా సీతక్క చెప్పుతో కొడతాం అని అంటుందన్నారు.
చెప్పుతో కొడుతా అనడం ఏంటి…?
మెమరీ ధరలు పెరగడంతో కాంట్రాక్ట్ నుంచి సామ్ సంగ్ మొబైల్ సంస్థ ఎగ్జిట్ అయిందని అంటున్నారు. మాకు సంస్కారం ఉంది. మా నాయకుడు కేసీఆర్ సంస్కారం నేర్పించారు. మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా, కేసీఆర్ క్షమాపణ చెప్పాలని సీతక్క లేఖ రాశారు. మేం తప్పుడు ఆరోపణలు చేస్తే సీబీఐ విచారణ చెయ్యండి అని లేఖ రాయొచ్చు కదా. సల్మాన్ ఖాన్ పక్కన, మిస్ వరల్డ్ పోగ్రామ్ దగ్గర ఉండి చూసుకున్న వ్యక్తి ఈ కాంట్రాక్ట్ వేరే వాళ్ళకి ఇప్పించాడని మాకు అనుమానం ఉంది. మా నాయకులపై కేసులు పెట్టి విచారణకు పిలిస్తే విచారణకు హాజరు అయ్యారు కదా… మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ సోషల్ మీడియాలో అంగన్వాడి వర్కర్స్ కు 5జీ మొబైల్ ఫోన్లు ఇస్తున్నామని పోస్ట్ చేశారు. దీనికి ఏం సమాధానం చెప్తారు. వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి సైతం తన సోషల్ మీడియాలో అంగన్వాడి వర్కర్స్ కు 5 స్మార్ట్ ఫోన్లు ఇస్తున్నామని పోస్ట్ చేశారు. 4జీ ఫోన్లు ఇస్తూ, 5జీ ఫోన్లు ఇస్తున్నామని చెప్పుకుంటున్న వారిని ఏ చెప్పుతో కొట్టాలో సీతక్క సమాధానం చెప్పాలి. సీతక్క చెప్పుతో కొడితే పడుతాం.. ప్రజలకు వాస్తవాలు చెప్పాలి కదా. అంగన్వాడి వర్కర్స్ కోసం ఇచ్చే స్మార్ట్ ఫోన్ల కాంట్రాక్ట్ నాకు సంబంధమే లేదని సీతక్క మాట్లాడి, ఇప్పుడు చెప్పుతో కొడుతా అనడం ఏంటి…? అని క్రిశాంక్ ప్రశ్నించారు.
సీతక్క వ్యాఖ్యలపై సతీష్‌రెడ్డి ఆగ్రహం
బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ సతీష్ రెడ్డి మాట్లాడుతూ.. స్మార్ట్ ఫోన్ల కొనుగోలు విషయం పై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే నిజాలు చెప్పకుండా మమ్మల్ని చెప్పుతో కొడతాం అని మాట్లాడిన సీతక్క వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. హైదరాబాద్ , ములుగు ఎక్కడికైనా వెళ్దాం అంగన్వాడీలకు ఇచ్చినటువంటి స్మార్ట్ ఫోన్ ఎంత ధర ఉందో తెలుస్తుంది. 50 కోట్ల టెండర్ పిలిచి
11 వేలు మాత్రమే ఉండే 4జీ ఫోన్ ను కొనుగోలు చేశారు. పక్క రాష్ట్రాల్లో 5g ఫోన్లు ఇస్తుంటే, తెలంగాణ రాష్ట్రంలో 4జీ ఫోన్ ఎందుకు ఇచ్చారో సమాధానం చెప్పాలి. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని మాపై ఆరోపణ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఇప్పటికీ వేల ఎకరాల పంటలు పండుతున్నాయి. ధన దాహంతో ములుగులో నలుగురిని పొట్టన పెట్టుకున్న విషయం మర్చిపోయావా సీతక్క. మేడారం జాతర టెండర్ కోసం ఇద్దరు మంత్రులు కొట్టుకుంది నిజం కాదా. 6 యేండ్ల బాలుడిని జీవితాంతం అంగ అంగవైకల్యం వచ్చేలా చేసింది మీరు కాదా ..? ములుగు గ్రామ పంచాయతీలో జీతాలు సరిగ్గా ఇవ్వలేకపోవడం అందులో పనిచేసే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.. ఇది వాస్తవం కాదా…? ఇవ్వన్ని జరుగుతుంటే మీపై ఎన్ని కేసులు పెట్టొచ్చు. ఎన్ని నోటీసులు ఇవ్వాలో సీతక్క సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
నిజాయితీ ఉంటే సీబీఐతో విచారణ జరపాలి
స్మార్ట్ ఫోన్ల కుంభకోణంలో విచారణ చేసి నిజాయితీ నిరూపించుకోండని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ దినేష్ చౌదరి అన్నారు. కాంగ్రెస్ పాలకులు మాట మాట మాట్లాడితే మాది ప్రజా పాలన అని మాట్లాడుతున్నారు. తక్కువ ధరకు మార్కెట్ లో ఫోన్ దొరుకుతుంటే , ఎక్కువ ధరకు ఎందుకు కొన్నారు అని మేం ప్రశ్నించాం. అంగన్వాడి వర్కర్స్ స్మార్ట్ ఫోన్ల కొనుగోల్లో విచారణ చేసి నిజాయితీ నిరూపించుకుంటే మంచిదే కదా. స్మార్ట్ ఫోన్ల కొనుగోల్లో నిజాయితీ నిరూపించకుండా , చెప్పుతో కొడతాం అని సీతక్క అంటున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అక్రమ మైనింగ్ పై సీబీ సీఐడీ విచారణ చేయిస్తాం అన్నప్పుడు, స్మార్ట్ ఫోన్ల కొనుగోలు పై ఎందుకు విచారణ చేయిస్తాం అనడం లేదు. కాంగ్రెస్, బిజెపి రెండు ములాఖాత్ అయి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయి. సీతక్కకు నిజాయితీ ఉంటే
స్మార్ట్ ఫోన్ల కొనుగోలు విషయంలో సీబీఐ విచారణకు డిమాండ్ చేయాలని అన్నారు.

