ఎగ్జిబిషన్ సందర్శనతో మానసిక ఉల్లాసం
వేసవి సాయంత్రాల్లో కుటుంబాలకు వినోద వేదిక
పిల్లల కోసం ప్రత్యేక వినోద, విజ్ఞాన ఐటమ్స్
కాంగ్రెస్ నాయకుడు గోపాల నవీన్ రాజ్
కాకతీయ, వరంగల్ సిటీ : ఎగ్జిబిషన్ ద్వారా నిత్య జీవిత ఒత్తిడికి దూరంగా ఉండి మానసిక ఉల్లాసం, ఉత్సాహం పొందవచ్చని కాంగ్రెస్ నాయకుడు గోపాల నవీన్ రాజ్ పేర్కొన్నారు. ఆదివారం వరంగల్ నగరంలోని ఇస్లామీయ కళాశాల గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను ఆయన ప్రారంభించారు. వేసవి కాలంలో సాయంత్రం వేళ కుటుంబ సమేతంగా వచ్చి వినోదాన్ని ఆస్వాదించేలా ఈ ఎగ్జిబిషన్ ఉపయోగపడుతుందని తెలిపారు. నయాగరా జలపాతం సెట్టింగ్‌ను స్వాగత ద్వారంగా ఏర్పాటు చేయడం సందర్శకులను ప్రత్యేకంగా ఆకట్టుకుంటుందని చెప్పారు.
ఆకర్షణీయ సెట్టింగులు, విభిన్న స్టాల్లు
పిల్లలకు విజ్ఞానంతో కూడిన వినోదాన్ని అందించే ఐటమ్స్ ఏర్పాటు చేయాలని నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో నిర్వాహకుడు అస్లాం మాట్లాడుతూ నగర ప్రజలకు వినోదాన్ని అందించాలనే లక్ష్యంతో భారీ సెట్టింగులు ఏర్పాటు చేశామని తెలిపారు. నయాగరా జలపాతం తరహా అలంకరణతో పాటు వివిధ ఆకర్షణీయ నిర్మాణాలు సందర్శకులను ఆకట్టుకునేలా రూపొందించామని చెప్పారు. దేశంలోని నలుమూలల నుండి వచ్చిన చేతివృత్తి కళాకారుల కలంకారీ వస్తువులు, మహిళల అలంకరణ సామగ్రి, గృహోపకరణాలు, పిల్లల బొమ్మలు వంటి విభిన్న ఉత్పత్తులతో 100కు పైగా స్టాల్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అమ్యూజ్మెంట్ పార్క్‌లో రెంజర్, జైంట్ వీల్ వంటి వినోద అంశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని పేర్కొన్నారు. అలాగే ఢిల్లీ పాపడ్, సిమ్లా మిర్చి, కలకత్తా చాట్ బండార్ వంటి ఫుడ్ స్టాల్స్ తో పాటు శీతల పానీయాలు, ఐస్ క్రీమ్ లు కూడా అందుబాటులో ఉంచామని తెలిపారు. ఎగ్జిబిషన్ ప్రతిరోజూ సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు కొనసాగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు శ్రీకాంత్, శివాజీ ఇంగోల్, మేనేజర్లు ఫిరోజ్, స్థానిక కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

