రైతు సంక్షేమమే డీసీసీబీ లక్ష్యం
రూ.727 కోట్ల రుణాలతో రైతులకు మేలు
రైతులకు చేరువలో బ్యాంకింగ్ సేవలు
మహిళల ఆర్థిక స్వావలంబనకు సంఘాల పాత్ర
విద్యార్థులకు రూ.50 లక్షల వరకు విద్యా రుణాలు
వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య
సహకార బ్యాంకుల విస్తరణకు పిలుపు
కాకతీయ, హనుమకొండ : రైతు సంక్షేమమే లక్ష్యంగా సహకార బ్యాంకులు కీలక పాత్ర పోషిస్తున్నాయని వరంగల్ లోక్ సభ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి డీసీసీబీ సేవలు మరింత విస్తరించాలని సూచించారు. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండల కేంద్రంలో వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్ నూతన శాఖను సోమవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ డాక్టర్ కడియం కావ్య స్థానిక ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఇనుగాల వెంకట్రామ్ రెడ్డి, డీసీసీబీ సీఈవో వాజీర్ సుల్తాన్ తదితరులతో కలిసి రిబ్బన్ కట్ చేసి శాఖను ప్రారంభించారు. కార్యక్రమానికి ముందు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బ్యాంక్ కార్యకలాపాలను పరిశీలించారు. ఎంపీ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. డీసీసీబీ రైతులకు ఆర్థికంగా తోడ్పడుతూ బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తోందని అభినందించారు. వరంగల్ జిల్లాలో ఇప్పటివరకు రూ.727 కోట్ల రుణాలు అందించామని, ఇతర విభాగాల ద్వారా రూ.2.8 కోట్ల పంట రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ లక్ష్యాలను మరింత పెంచాల్సిన అవసరం ఉందన్నారు. రైతులు వ్యవసాయ పరికరాల కొనుగోలుకు రుణాలను వినియోగించుకోవాలని సూచించారు.
సేవల విస్తరణపై దృష్టి
స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలకు ఆర్థిక స్వావలంబన పెరుగుతోందని ఎంపీ పేర్కొన్నారు. వ్యవసాయ భూముల తనఖాపై విద్యార్థులకు రూ.50 లక్షల వరకు విద్యా రుణాలు అందించడం అభినందనీయమన్నారు. బంగారు ఆభరణాలపై రూ.541 కోట్ల రుణాలు మంజూరు కావడం బ్యాంక్‌పై ప్రజల విశ్వాసానికి నిదర్శనమని తెలిపారు. హసన్‌పర్తి శాఖలో త్వరలో మల్టీ సర్వీస్ సెంటర్ ఏర్పాటు చేయాలని సూచించారు. రైతులకు మరింత అవగాహన కల్పించి సేవలను విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలను మరింత అందుబాటులోకి తీసుకురావాలని తెలిపారు. ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఇనుగాల వెంకట్రామ్ రెడ్డి మాట్లాడుతూ సహకార బ్యాంకులు రైతు సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నాయని తెలిపారు. ఈ నూతన శాఖ ద్వారా హసన్‌పర్తి మండల ప్రజలకు తక్కువ వడ్డీకే రుణాలు, ఇతర బ్యాంకింగ్ సేవలు సులభంగా అందుతాయని పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం సహకార రంగ అభివృద్ధికి కట్టుబడి ఉందని వారు స్పష్టం చేశారు. రైతులు, మహిళలు, విద్యార్థులు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, డీసీసీబీ డి డి రవీందర్, ఏవో అనురాధ, పీఏసీఎస్ ఇంచార్జ్ జగన్మోహన్ రావు, కిసాన్ సెల్ అధ్యక్షులు, నాబార్డ్ ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

