ఇసుక లారీల అడ్డగింతపై ఆందోళన
ములుగు-భద్రాద్రి జిల్లా సరిహద్దుల్లో గిరిజన మహిళల రాస్తారోకో
గంటల తరబడి ట్రాఫిక్ జాంతో వాహనదారుల అవస్తలు
భద్రాద్రి జిల్లా నుంచి వచ్చే లారీలను అడ్డుకుంటున్న ములుగు పోలీసులు
లారీకి రూ.500చొప్పున వసూలు చేసి వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు
కాకతీయ, తెలంగాణ బ్యూరో : ఇసుక లారీల రాకపోకలపై నియంత్రణ లేకపోవడాన్ని వ్యతిరేకిస్తూ మహిళా ఇసుక సొసైటీ సభ్యులు, గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
చర్ల నుంచి ములుగుజిల్లా నూగూరు వెంకటపూర్‌కు వెళ్లే రాళ్లవాగు ప్రాంతంలో గిరిజన ఇసుక సొసైటీ క్వారీ సభ్యులైన మహిళలు రాస్తారోకో నిర్వహించారు. ములుగు జిల్లా అధికారుల తీరుపై నినాదాలు చేస్తూ చట్టబద్ధ అనుమతులతో నడుస్తున్న లారీలను అడ్డుకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. సుమారు 6 గంటల పాటు ఆందోళన కొనసాగడంతో భద్రాద్రి కొత్తగూడెం- ములుగు జిల్లా సరిహద్దుల్లో రహదారి ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వెంకటపూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో మహిళలు ఆందోళనను విరమించారు. అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.

లారీకి రూ.500చొప్పున వసూలు..వీడియో వైరల్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్ల, మణుగూరు ఏరియాలోని ఇసుక క్వారీల నుంచి ములుగు జిల్లా మీదుగా వస్తున్న ఇసుక లారీలను కొద్దిరోజులుగా పోలీసు అధికారులు అడ్డుకుంటున్నారు. మంగపేట, వెంకటపూర్‌ల వద్ద ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేసి వెనక్కి పంపిస్తున్నారు.జిల్లా రోడ్ల మీద నుంచి వెళ్లడంతో ట్రాఫిక్ సమస్యలతో పాటు రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆవిధంగా చేస్తున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. కొంతమంది కింది స్థాయి సిబ్బంది లారీకి రూ.300ల నుంచి 500 వరకు తీసుకుంటూ వదులుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి ఓ లారీ డ్రైవర్ ఫోన్‌లో మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం గమనార్హం.

