పర్యాటక ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలి
పర్యాటకులు పెరిగేలా సమగ్ర ప్రణాళికలు
జలాశయ కేంద్రాల్లో ఆధునిక బోట్ల ఏర్పాటుకు చర్యలు
మాస్టర్ ప్లాన్‌లతో ప్రత్యేక పర్యాటక ప్రాంతాల అభివృద్ధి
మౌలిక సదుపాయాలు, భద్రతపై ప్రత్యేక దృష్టి
పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
కాకతీయ, హైదరాబాద్ : రాష్ట్రంలో చేపట్టిన పర్యాటక ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. పర్యాటకుల సంఖ్య పెరిగేలా సమగ్ర ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని సూచించారు. హిమాయత్‌నగర్‌లోని పర్యాటక అభివృద్ధి సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో టీజీటీడీసీ ఛైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, ఉన్నతాధికారులతో కలిసి మంత్రి వివిధ ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రాయోజిత పథకాలు, ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో చేపట్టిన ప్రాజెక్టుల వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు వివరించారు.
జిల్లాల ప్రగతిపై మంత్రి ఆరా..!
జిల్లాల వారీగా రూ.274.93 కోట్ల అంచనా వ్యయంతో కొనసాగుతున్న పనుల పురోగతిని మంత్రి తెలుసుకున్నారు. ప్రతి ప్రాజెక్టుకు స్పష్టమైన టైం లైన్ నిర్దేశించి గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రస్తుత ప్రాజెక్టులతో పాటు కొత్త ప్రాజెక్టుల కోసం డీపీఆర్‌ల తయారీ, కాటేజీల నిర్మాణం, కేంద్ర పథకాల అమలు, నిధుల వినియోగంపై మంత్రి చర్చించారు. ఆధ్యాత్మిక, వారసత్వ, ఎకో-వెల్నెస్, హస్తకళలు, జల, బౌద్ధ సర్క్యూట్ల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్‌లను సిద్ధం చేయాలని సూచించారు. నాగార్జున సాగర్, రామప్ప-వరంగల్, యాదగిరిగుట్ట-పోచంపల్లి, సోమశిల-ఆలంపూర్ ప్రాంతాలకు సంబంధించిన ప్రణాళికలపై దిశానిర్దేశం చేశారు. రామప్ప ఆలయం సమీపంలో అదనపు కాటేజీల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. అవసరమైన చోట సంప్రదాయ బోట్ల స్థానంలో ఆధునిక బోట్లను ప్రవేశపెట్టాలని, సోమశిలలో అదనపు బోటింగ్ సౌకర్యాలు కల్పించాలని చెప్పారు. ఎత్తైన ప్రాంతాల్లో క్యాంటీలివర్ వ్యూ పాయింట్ల ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సూచించారు.
మౌలిక సదుపాయాలు కల్పించాలి
వారసత్వ సంపదను సంరక్షిస్తూ పర్యాటకులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలని మంత్రి అన్నారు. చారిత్రక కట్టడాల పునరుద్ధరణకు అవసరమైతే నిధులు మంజూరు చేస్తామని తెలిపారు.
పర్యాటక ప్రాంతాల్లో పరిశుభ్రత, నిర్వహణ, భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రముఖ ప్రాంతాల్లో కళా ప్రదర్శనల కోసం థియేటర్ల నిర్మాణం చేపట్టి స్థానిక కళాకారులకు ఉపాధి కల్పించాలని సూచించారు. రాష్ట్రాన్ని ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పర్యాటక రంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు. పెట్టుబడులను ఆకర్షించే విధంగా అనుకూల వాతావరణం సృష్టించాలని పేర్కొన్నారు. తెలంగాణను దేశంలోనే ప్రముఖ పర్యాటక రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. పర్యాటక రంగ విస్తరణతో రాష్ట్రానికి ఆదాయం పెరగడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా విస్తరిస్తాయని తెలిపారు. ఈ సమావేశంలో స్పెషల్ సీఎస్ వాణి ప్రసాద్, ఎండీ గౌతమి, బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లెపల్లి లక్ష్మయ్య, పురావస్తు శాఖ డైరెక్టర్ అర్జున రావు తదితరులు పాల్గొన్నారు.

