విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోవాలి
మొబైల్ వాడకం తగ్గించి సృజనాత్మకతపై దృష్టి పెట్టాలి
హన్మకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్
శాయంపేట గురుకుల పాఠశాలలో విద్యా సౌకర్యాల పరిశీలన
కాకతీయ, హనుమకొండ: విద్యార్థులు క్రమశిక్షణను అలవర్చుకుని, నిరంతర కృషితో తమ లక్ష్యాలను సాధించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ సూచించారు. సంక్షేమ పథకాల వారోత్సవాల నేపథ్యంలో మంగళవారం శాయంపేటలోని మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యా వాతావరణం, వసతి, భోజన సౌకర్యాలను స్వయంగా పరిశీలించారు. కలెక్టర్ తరగతి గదులకు వెళ్లి విద్యార్థులతో నేరుగా ముచ్చటించారు. వారి అభ్యాస స్థాయిని, పాఠ్యాంశాలపై ఉన్న అవగాహనను అడిగి తెలుసుకున్నారు. ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని దాన్ని చేరుకోవడానికి ప్రణాళికాబద్ధంగా చదవాలని దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా పరీక్షల సమయంలో సమయపాలన పాటిస్తూ, ఏకాగ్రతతో చదివి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
వేసవి సెలవులను సద్వినియోగం చేసుకోవాలి
త్వరలో రానున్న వేసవి సెలవుల్లో కేవలం ఆటపాటలకే పరిమితం కాకుండా, చదివిన పాఠాలను పునశ్చరణ (రివిజన్) చేసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. ప్రస్తుత కాలంలో మొబైల్ ఫోన్ల వినియోగానికి దూరంగా ఉంటూ, సృజనాత్మక కార్యక్రమాలు, పుస్తక పఠనంపై ఆసక్తి పెంచుకోవాలని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందించడంలో రాజీ పడొద్దని అధికారులను, ఉపాధ్యాయులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

