సన్నాలకు మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్
48 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి నగదు
నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
గొట్లకొండ తండాలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
కాకతీయ, నెక్కొండ: రైతులు పండించిన వరి ధాన్యానికి ప్రభుత్వం మద్దతు ధరతో పాటు బోనస్ చెల్లించి అండగా నిలుస్తుందని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. నెక్కొండ మండలంలోని గొట్లకొండ తండాలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. యాసంగి సీజన్‌కు సంబంధించి రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందవద్దని భరోసానిచ్చారు. సన్నవడ్లకు క్వింటాల్‌కు 2,389 రూపాయల మద్దతు ధరతో పాటు అదనంగా 500 రూపాయల బోనస్ అందిస్తున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. “రైతులు అమ్మిన ధాన్యానికి సంబంధించిన నగదును 48 గంటల్లోనే నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేసేలా చర్యలు తీసుకున్నాం. మధ్యవర్తులను నమ్మి మోసపోకుండా, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలి” అని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు సొంటిరెడ్డి రంజిత్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి, ఎంపీడీఓ యాసం లావణ్య, ఏపీఎం కిరణ్ కుమార్, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు రజిత, జిల్లా ప్రధాన కార్యదర్శి బక్కి అశోక్, నెక్కొండ సర్పంచ్ పెండ్యాల హరిప్రసాద్, మండల అధ్యక్షుడు లావుడ్యా తిరుమల్ చౌహన్ మరియు స్థానిక రైతులు, కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.

