మేడపల్లిలో వైభవంగా కంఠ మహేశ్వర స్వామి ప్రతిష్ట
ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
భక్తిశ్రద్ధలతో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం
కాకతీయ, నల్లబెల్లి: మండలంలోని మేడపల్లి గ్రామంలో ఆదివారం శ్రీ కంఠ మహేశ్వర స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. మేడపల్లి, రాంపూర్, గొల్లపల్లి గ్రామాలకు చెందిన గౌడ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన ఈ ఆలయ వేడుకలకు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు, సంఘ ప్రతినిధులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం గర్భగుడిలో ప్రతిష్టించిన కంఠ మహేశ్వర స్వామికి సుదర్శన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కులవృత్తుల వారు తమ ఆరాధ్య దైవాల ఆలయాలను నిర్మించుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. భక్తి భావం వల్ల గ్రామాల్లో సఖ్యత పెరిగి, ప్రజల మధ్య సుఖశాంతులు నెలకొంటాయని తెలిపారు. మూడు గ్రామాల గౌడ సంఘం సభ్యులు ఐక్యతతో ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేయడం హర్షణీయమన్నారు. కార్యక్రమం అనంతరం గౌడ సంఘం నాయకులు మాజీ ఎమ్మెల్యేను శాలువాతో ఘనంగా సన్మానించి, జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గౌడ సంఘం నాయకులు మరియు మూడు గ్రామాల నుంచి తరలివచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణం భజనలు, కీర్తనలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

