మేడే స్ఫూర్తితో హక్కుల పోరాటం
నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలి
బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు
కాకతీయ, నర్సంపేట టౌన్: కార్మిక వర్గ హక్కుల పరిరక్షణ కోసం మేడే స్ఫూర్తితో ఉద్యమాలను ఉధృతం చేయాలని బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నర్సంపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో హమాలీ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కొల్లూరి లక్ష్మీనారాయణ అధ్యక్షతన ఆదివారం హమాలీ కార్మికుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యువరాజు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్, బహుళజాతి కంపెనీలకు అనుకూలంగా కార్మిక చట్టాల్లో మార్పులు చేపట్టడం దురదృష్టకరమని యువరాజు విమర్శించారు. “ఎన్నో పోరాటాలు, త్యాగాల ఫలితంగా సాధించుకున్న ఎనిమిది గంటల పని విధానం వంటి హక్కులను కేంద్రం కాలరాస్తోంది. కార్మికుల రక్షణ కోసం ఉన్న చట్టాలను రద్దు చేయడం సరికాదు” అని స్పష్టం చేశారు. తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల తరహాలోనే తెలంగాణ ప్రభుత్వం కూడా లేబర్ కోడ్ల అమలును వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి పాలడుగుల రమేష్, హమాలీ డివిజన్ అధ్యక్షుడు బొల్లం ప్రసాద్, నాయకులు గాండ్ల రాములు, బిక్షపతి, అనిల్ కుమార్, స్వామి, మొగిలి, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.

