కరీంనగర్ ఘటనకు నిరసనగా బల్దియా ఉద్యోగుల ఆందోళన
నల్లబ్యాడ్జీలతో లంచ్ టైమ్‌లో నిరసన
మాజీ డిప్యూటీ మేయర్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్
కాకతీయ, వరంగల్: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో అధికారులు, సిబ్బందిపై జరిగిన దాడిని నిరసిస్తూ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులు మంగళవారం ఆందోళన చేపట్టారు. మధ్యాహ్నం భోజన విరామ సమయంలో బల్దియా ప్రధాన కార్యాలయం ఎదుట నల్లబ్యాడ్జీలు ధరించి తమ నిరసనను వ్యక్తం చేశారు. కరీంనగర్ మున్సిపల్ కార్యాలయంలో సోమవారం మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ళ రమేష్ ఎంహెచ్‌ఓను కలిసేందుకు వెళ్లి, ఆయన అందుబాటులో లేకపోవడంతో శానిటరీ సూపర్‌వైజర్ శ్యామ్ రాజుపై దుర్భాషలాడటమే కాకుండా, కార్యాలయ ఫర్నిచర్‌ను ధ్వంసం చేయడంపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో ఉన్న అధికారుల పట్ల ఇలాంటి దాడులు చేయడం అమానుషమని వరంగల్ బల్దియా ఉద్యోగులు పేర్కొన్నారు. ఈ ఘటనను ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఉద్యోగులు నిరసనలు చేపట్టారు. కరీంనగర్ మాజీ డిప్యూటీ మేయర్‌ను తక్షణమే అరెస్ట్ చేయాలని, విధుల్లో ఉన్న మున్సిపల్ ఉద్యోగులకు తగిన రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

