ఆ బాటిళ్లు ఎక్కడివి..?
ఐటీడీఏ గోదాం వద్ద నీటి బాటిళ్ల గుట్టలు!
గుట్టుచప్పుడు కాకుండా డిస్పోజల్ ప్రక్రియ
అధికారుల పర్యవేక్షణ శూన్యం.. మీడియాను చూసి పరార్
జాతర స్టాక్ వృథాపై సర్వత్రా విమర్శలు
కాకతీయ, ఏటూరునాగారం : ఏటూరునాగారం మండల కేంద్రంలోని డీఆర్ఎస్ గోదాం వద్ద భారీగా నిల్వ ఉన్న గడువు ముగిసిన మినరల్ వాటర్ బాటిళ్లు మంగళవారం కలకలం రేపాయి. సుమారు 300 కాటన్లకు పైగా ఉన్న ‘కేన్లీ’ కంపెనీ బాటిళ్లను కొంతమంది వ్యక్తులు గుట్టుచప్పుడు కాకుండా ఖాళీ చేస్తూ డిస్పోజల్ చేస్తుండటం స్థానికంగా చర్చనీయాంశమైంది. అధికారుల పర్యవేక్షణ లేకుండా సాగుతున్న ఈ వ్యవహారంపై మీడియా ప్రతినిధులు అక్కడికి చేరుకోగానే, బాటిళ్లను ఖాళీ చేస్తున్న వ్యక్తులు జారుకోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఐటీడీఏ పరిధిలో గడిచిన రెండు మేడారం జాతరల కోసం భారీ స్థాయిలో ఈ నీటి బాటిళ్లను తెప్పించినట్లు సమాచారం. అయితే జాతర సమయంలో భక్తులకు వీటిని పంపిణీ చేయకుండా గోదాముల్లోనే నిల్వ ఉంచడంతో, కాలక్రమేణా గడువు ముగిసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ధనంతో కొనుగోలు చేసిన వేల బాటిళ్లు వినియోగం లేక వృథా కావడం, ఇప్పుడు వాటిని రహస్యంగా పారబోయడంపై స్థానికులు మండిపడుతున్నారు. ఈ అంశంపై గోదాం ఇంచార్జ్ సహా సంబంధిత అధికారులను వివరణ కోరేందుకు ప్రయత్నించగా వారు అందుబాటులోకి రాకపోవడం గమనార్హం.
నిబంధనలు గాలికి!
ప్రభుత్వ నిబంధనల ప్రకారం గడువు ముగిసిన వస్తువులను డిస్పోజ్ చేయాలంటే ముందుగా స్టాక్ వెరిఫికేషన్ నిర్వహించి, ఉన్నతాధికారుల నుంచి లిఖితపూర్వక అనుమతి పొందాలి. మొత్తం ప్రక్రియను అధికారుల పర్యవేక్షణలో పంచనామా నిర్వహించి, ప్లాస్టిక్ బాటిళ్లను రీసైక్లింగ్ కేంద్రాలకు తరలించాలి. కానీ, ఇక్కడ అవేవీ పాటించకుండానే బాటిళ్లను ఖాళీ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పర్యావరణానికి హాని కలగకుండా చూడాల్సిన బాధ్యతను అధికారులు విస్మరించారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ ధనం వృథా కావడమే కాకుండా, నిబంధనలకు విరుద్ధంగా డిస్పోజల్కు పాల్పడుతున్న వారిపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఏటూరునాగారం వాసులు డిమాండ్ చేస్తున్నారు.

