యువతను డ్రగ్స్ బారి నుంచి కాపాడుకుందాం
వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్
కేసుల దర్యాప్తులో వేగం పెంచాలి
నిబంధనలు ఉల్లంఘించే దుకాణదారులపై బైండోవర్ కేసులు
పోలీస్ అధికారులకు ప్రశంసా పత్రాల పంపిణీ
కాకతీయ, హనుమకొండ : సమాజాన్ని పట్టి పీడిస్తున్న మత్తు పదార్థాల బారిన పడి యువత తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ అన్నారు. మంగళవారం కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించిన నెలవారీ నేర సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని అధికారులకు దిశానిర్దేశం చేశారు. పెండింగ్ కేసుల పరిష్కారం, నిందితుల అరెస్టులు, దర్యాప్తు పురోగతిపై స్టేషన్ల వారీగా ఆరా తీశారు. డ్రగ్స్, గంజాయి నియంత్రణ కోసం విద్యాసంస్థలు, గ్రామాలు, ప్రధాన కూడళ్లలో విస్తృతంగా అవగాహన సదస్సులు నిర్వహించాలని సీపీ ఆదేశించారు. ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలలకు 100 మీటర్ల పరిధిలో పొగాకు ఉత్పత్తుల విక్రయాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మత్తు పదార్థాల అక్రమ రవాణాపై నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు.

శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయం
కమిషనరేట్ పరిధిలో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్ణీత సమయానికే దుకాణాలు మూసివేయించేలా చూడాలని, నిబంధనలు అతిక్రమిస్తే డీసీపీల ఎదుట బైండోవర్ చేయాలని ఆదేశించారు. మూగజీవాల అక్రమ రవాణాపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. పెట్రోల్, డీజిల్ కొరతపై వస్తున్న తప్పుడు ప్రచారాల నేపథ్యంలో బంకుల వద్ద రద్దీ పెరిగే అవకాశం ఉందని, ఎక్కడా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పోక్సో కేసులు, మత్తు పదార్థాల నియంత్రణలో నిందితులకు శిక్షలు పడేలా కృషి చేసిన అధికారులు, సిబ్బందికి సీపీ నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సమావేశంలో డీసీపీలు అంకిత్ కుమార్, రాజమహేంద్ర నాయక్, దార కవిత, ట్రైనీ ఐపీఎస్ మనిషా నేహ్రా, అదనపు డీసీపీలు రవి, బాలస్వామి, సురేష్ కుమార్ మరియు ఏసీపీలు, ఇన్స్‌పెక్టర్లు పాల్గొన్నారు.

