చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం
వంటిమామిడి మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ మోహన్
వర్గల్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
కాకతీయ, గజ్వేల్ : రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, అన్నదాతలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వంటిమామిడి మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ మోహన్ స్పష్టం చేశారు. మంగళవారం వర్గల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ జయభారతి, పీఏసీఎస్ అధికారులతో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయ మోహన్ మాట్లాడుతూ.. రైతులు తమ ధాన్యాన్ని నిబంధనల మేరకు ఆరబెట్టుకొని, నాణ్యతా ప్రమాణాలతో కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. ప్రస్తుత తరుణంలో ఈదురు గాలులు, వడగండ్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తడవకుండా అన్నదాతలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. రైతుల సౌకర్యార్థం అవసరమైన ప్రతి చోటా ప్రభుత్వం కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని వివరించారు.
సన్నాలకు బోనస్.. దళారులకు చెక్!
సన్న రకం ధాన్యం పండించిన రైతులకు క్వింటాలుకు రూ. 500 బోనస్ అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆమె వెల్లడించారు. మధ్య దళారులను ఆశ్రయించి నష్టపోవద్దని, ప్రభుత్వ కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధరతో పాటు బోనస్ పొంది ఆర్థికంగా బలోపేతం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పీఏసీఎస్ ప్రత్యేక అధికారి శ్రీనివాస్ రెడ్డి, సీఈఓ జితేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి, బీఆర్ఎస్ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు నాగరాజు, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి మరియు వార్డు సభ్యులు, స్థానిక నేతలు పాల్గొన్నారు.

