95.15 శాతం ఉత్తీర్ణత
మళ్లీ బాలికలదే హవా
సత్తాచాటిన సర్కార్ బడులు
ములుగు ఫస్ట్… హైదరాబాద్ లాస్ట్
టెన్త్ పరీ|క్షా ఫలితాలు విడుదల
నేటి నుంచి మే 15 వరకు రీ కౌంటింగ్
రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తుల ఆహ్వానం
జూన్ 5 నుంచి 12 వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ..
ములుగు జిల్లా ప్రథమ స్థానంలో నిలవడంపై మంత్రి సీతక్క హర్షం
విద్యార్థులు, ఉపాధ్యాయులకు అభినందనలు
కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ సెక్రటరీ యోగితారాణా, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ నవీన్ నికోలస్‌లతో కలిసి ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు ఫలితాలను విడుదల చేశారు. మొత్తంగా 95.15 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలికల్లో 96.26 శాతం, బాలురు 94.07 శాతం ఉత్తీర్ణత నమోదు చేశారు. 5,731 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, 6 పాఠశాలల్లో 0 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ములుగు జిల్లాలో అత్యధికంగా 99.30 శాతం, అత్యల్పంగా హైదరాబాద్ జిల్లాలో 89.23 శాతం ఉత్తీర్ణత నమోదైంది. సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 99.10 శాతం ఉత్తీర్ణత నమోదైంది. తెలుగు మీడియం విద్యార్థుల్లో 89.14 శాతం, ఇంగ్లీష్ మీడియం విద్యార్థుల్లో 95.86 శాతం, ఉర్దూ మీడియం విద్యార్థుల్లో 86.71 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. నేటి నుంచి మే 15 వరకు రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ దరఖాస్తులకు అవకాశం కల్పించారు. జూన్ 5 నుంచి 12 వరకు పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. రేపట్నుంచి మే14 వరకు అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ ఫీజు చెల్లింపునకు అవకాశం కల్పించారు. పదో తరగతి ఫలితాల్లో ములుగు తొలి స్థానంలో నిలవడంపై మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. జిల్లా యంత్రంగానికి, విద్యాశాఖ అధికారులకు, ఉపాధ్యాయులు, విద్యార్థులకు సీతక్క అభినందనలు తెలిపారు.

ములుగు టాప్
ఇక జిల్లాల పరంగా చూసుకుంటే.. 99.30 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి ములుగు జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. 89.23 శాతం ఉత్తీర్ణత శాతంతో హైదరాబాద్ జిల్లా చివరి స్థానంలో ఉంది. పదో తరగతి విద్యార్థులు తమ ఫలితాలను ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ http://bse.telangana.gov.in/ లో లాగిన్ అయి తెలుసుకోవచ్చని విద్యాశాఖ వెల్లడించింది. 8096958096 వాట్సాప్ నంబర్‌కు మెసేజ్ చేసినా రిజల్ట్స్ నేరుగా వస్తాయని తెలిపింది. విద్యాశాఖ తొలిసారిగా పదవ తరగతి ఫలితాలను వాట్సాప్ ద్వారా అందిస్తోంది. ఇక గతేడాది 2025 విద్యా సంవత్సరంలో ఓవరాల్ పాస్ పర్సంటేజ్ 92.78 శాతం కాగా.. గతం కంటే ఇప్పుడు కొంత పెరిగింది. అబ్బాయిలు, అమ్మాయిల ఉత్తీర్ణత శాతం కూడా గతేడాది పోలిస్తే పెరిగిందని తెలిపారు.

