పంట మార్పిడితోనే నేల ఆరోగ్యం పదిలం
అవసరానికి మించి ఎరువులు వాడొద్దు
రైతులకు శాస్త్రవేత్తల హితబోధ
కన్నారావుపేటలో ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’
కాకతీయ, నల్లబెల్లి: సాగు ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు భూసారాన్ని కాపాడుకోవడానికి రైతులు తప్పనిసరిగా పంట మార్పిడి విధానాన్ని అనుసరించాలని శాస్త్రవేత్తలు సూచించారు. నల్లబెల్లి మండలం కన్నారావుపేట గ్రామ రైతు వేదిక వద్ద బుధవారం ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమంలో భాగంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు మాట్లాడుతూ.. అధిక మొత్తంలో యూరియా వాడటం వల్ల నేల, నీరు, వాతావరణం కలుషితమవుతాయని హెచ్చరించారు. వరి పంటకు 100 కిలోల యూరియా, 50 కిలోల డీఏపీ, 25 కిలోల పోటాష్ మాత్రమే వాడాలని స్పష్టం చేశారు. అవసరానికి మించి రసాయన ఎరువులు, పురుగుమందులు వినియోగిస్తే భూసారం క్షీణించి పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని తెలిపారు. ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసినప్పుడు రైతులు తప్పనిసరిగా రసీదులు తీసుకోవాలని, పంట నష్టం జరిగినప్పుడు పరిహారం పొందేందుకు ఇవి కీలకమని వివరించారు.
పంట మార్పిడితో అధిక దిగుబడులు..
వరికి ముందు పచ్చిరొట్ట పంటలు, వరి తర్వాత పెసర్లు, మినుములు, బొబ్బర్లు సాగు చేయడం వల్ల నేల సారవంతం అవుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. సాగునీటిని పొదుపుగా వాడుతూ జలవనరులను కాపాడాలని కోరారు. చెట్లు పెంచడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, పీడీ ఆత్మ విజయ నిర్మల, శాస్త్రవేత్తలు డాక్టర్ సి.హెచ్. రాములు, డాక్టర్ జి. పద్మజ, మండల వ్యవసాయ అధికారి రజిత, ఏఈఓ విశ్వభాను, సర్పంచ్ పల్నాటి మూర్తి, ఉపసర్పంచ్ కొండ రవి మరియు అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

