బెల్లి లలితక్క ఆశయాలు యువతకు ఆదర్శం
నివాళులర్పించిన సర్పంచ్ మాదరి ప్రశాంత్
కాకతీయ, నెల్లికుదురు : తెలంగాణ మలిదశ ఉద్యమ నాయకురాలు, గానకోకిల బెల్లి లలితక్క పోరాట పటిమ నేటి యువతకు ఆదర్శమని శ్రీరామగిరి సర్పంచ్ మాదరి ప్రశాంత్ కొనియాడారు. బుధవారం మండలంలోని శ్రీరామగిరి గ్రామపంచాయతీలో సర్పంచ్ ఆధ్వర్యంలో బెల్లి లలితక్క జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సర్పంచ్ మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో ప్రజలను చైతన్య పరిచిన లలితక్క ఆశయాలను సమాజం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఆమె చూపిన బాటలో యువత నడవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గుగులోత్ బాలాజీ, ఉపసర్పంచ్ రామగిరి సుమన్, వార్డు సభ్యులు గొల్లపల్లి వేణు, పోరండ్ల గణేష్, జంజిరాల నరేష్, అంగోత్ పంతులు పాల్గొన్నారు. వీరితో పాటు గ్రామస్తులు సంద కృష్ణ, బెల్లి నర్సయ్య, సోమిరెడ్డి, మద్దెల సమ్మయ్య, పంజాల యాకన్న, సిబ్బంది తదితరులు పాల్గొని లలితక్క సేవలను స్మరించుకున్నారు.

