రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం సేకరణ
సకాలంలో కొనుగోలు చేసి మద్దతు ధర కల్పించాలి
కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి
సమీక్షలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
కాకతీయ, హనుమకొండ: వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలో పండించిన ప్రతి గింజా కొనుగోలు చేయాలని, రైతులకు ఎక్కడా ఇబ్బందులు కలగకుండా ధాన్యం, మొక్కజొన్న సేకరణను సమర్థవంతంగా నిర్వహించాలని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అధికారులను ఆదేశించారు. హనుమకొండలో ఆదివారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈసారి మొక్కజొన్న దిగుబడులు ఆశాజనకంగా ఉన్న నేపథ్యంలో, రైతుల పంటను సకాలంలో సేకరించి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర కల్పించాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అవసరమైన తాగునీరు, నీడ వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎమ్మెల్యే తెలిపారు. అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం తడవకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని, రవాణాలో జాప్యం లేకుండా చూడాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఏర్పాట్లు పూర్తి చేశాం: కలెక్టర్లు
ఈ సమావేశంలో పాల్గొన్న హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని అన్ని కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశామని వెల్లడించారు. గన్ని బ్యాగుల కొరత లేకుండా చర్యలు తీసుకున్నామని, కొనుగోలు చేసిన వెంటనే నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసేలా నిరంతరం పర్యవేక్షిస్తున్నామని ఎమ్మెల్యేకు వివరించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

