లక్ష్యసాధనతోనే ఉన్నత శిఖరాలకు
పట్టుదలతో చదివితేనే ఉజ్వల భవిష్యత్తు
కొత్తగూడెం మేయర్ మూడ్ గణేష్
10వ తరగతి ప్రతిభావంతులకు సన్మానం
కాకతీయ, కొత్తగూడెం: విద్యార్థులు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని పట్టుదలతో శ్రమించినప్పుడే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్ అన్నారు. పాల్వంచ 8వ డివిజన్లో పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను సన్మానిస్తూ ఆదివారం నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. విద్యార్థులు కేవలం పుస్తక పఠనానికే పరిమితం కాకుండా, సమాజం పట్ల అవగాహన పెంచుకోవాలని సూచించారు. కఠిన శ్రమతో చదివి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి గౌరవించడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, ఇది వారి తదుపరి ఎదుగుదలకు దోహదపడుతుందని పేర్కొన్నారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థుల ఉన్నత చదువులకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఈ సందర్భంగా ఆయన భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సిరిపురపు లలిత కుమారి, ప్రముఖ నాయకులు కనగాల అనంతరాములు, అడుసుమిల్లి సాయి బాబా, ఉప్పుశెట్టి రాహుల్ పాల్గొన్నారు. వీరితో పాటు వీసంశెట్టి పూర్ణ చంద్రరావు, విశ్వం, దినేష్, కాంపెల్లి కనకేష్, గొర్లె నరేష్, అన్నారపు వెంకటేశ్వర్లు, రామాచారి, ఆలపాటి ప్రసాద్, కాకటి రవీంద్ర, దుర్గాభవాని తదితరులు పాల్గొని విద్యార్థులను అభినందించారు.

