భూసార పరీక్షలతోనే మేలైన సాగు
ఎరువుల వినియోగంలో జాగ్రత్తలు వహించాలి
రైతు వారోత్సవాల్లో జిల్లా కలెక్టర్ డా. సత్య శారద
కాకతీయ, గీసుగొండ: రైతులు తమ పొలాల్లో భూసార పరీక్షలు చేయించుకుని, ఆ నివేదికల ఆధారంగానే ఎరువులను వినియోగించాలని జిల్లా కలెక్టర్ డా. సత్య శారద సూచించారు. అప్పుడే అధిక దిగుబడులు సాధించడంతో పాటు సాగు ఖర్చును తగ్గించుకోవచ్చని పేర్కొన్నారు. ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా మండలంలోని కొనాయిమాకుల రైతు వేదికలో సోమవారం నిర్వహించిన రైతు వారోత్సవాలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వ్యవసాయంలో వస్తున్న నూతన సాంకేతిక పద్ధతులపై రైతులు అవగాహన పెంచుకోవాలని కోరారు. రైతు వేదికలు కేవలం భవనాలుగా కాకుండా, సమాచార మార్పిడి కేంద్రాలుగా రైతులకు నిరంతరం అందుబాటులో ఉండాలని ఆకాంక్షించారు.
యూరియా వాడకం తగ్గించాలి..
ప్రధాన శాస్త్రవేత్త ఎ. వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులు సిఫారసు చేసిన మేరకు మాత్రమే యూరియాను వాడాలని, పచ్చిరొట్ట ఎరువుల వాడకాన్ని పెంచి భూమి సారాన్ని కాపాడుకోవాలని సూచించారు. శాస్త్రవేత్త బి. మాధవి వరి రకాల ఎంపిక, సాగునీటి పొదుపు పద్ధతులు, పంట మార్పిడి వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. అనంతరం వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ అనురాధ మాట్లాడుతూ.. రసాయనిక ఎరువులు, పురుగుమందులను విచక్షణా రహితంగా వాడకుండా సేంద్రీయ వ్యవసాయం వైపు రైతులు మొగ్గు చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశువైద్య అధికారి డా. ఎం. బాలకృష్ణ, జిల్లా ఉద్యాన అధికారి శ్రీనివాసరావు, జిల్లా మత్స్యశాఖ అధికారి పి. శ్రీపతి, డీసీఓ నీరజ, ఇరిగేషన్ ఈఈ ప్రశాంతి, తహసీల్దార్ రియాజుద్దీన్, మండల వ్యవసాయ అధికారి హరిప్రసాద్, సర్పంచ్ వి. రాజు, బీఎస్సీ అగ్రికల్చర్ విద్యార్థులు మరియు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

