విగ్రహ ప్రతిష్ఠాపనకు మంత్రికి ఆహ్వానం
మంత్రి కొండా సురేఖను కోరిన ఆలయ కమిటీ
రాంపూర్‌లో 7 నుంచి ఉత్సవాలు ప్రారంభం
కాకతీయ, గీసుగొండ: మండలంలోని రాంపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాలకు హాజరుకావాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను ఆలయ కమిటీ కోరింది. సోమవారం హైదరాబాద్‌లోని మంత్రి నివాసంలో ఆలయ కమిటీ చైర్మన్ తాబేటి వెంకటేశ్వర్లు ఆమెను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ నెల 7వ తేదీ (గురువారం) నుంచి 9వ తేదీ (శనివారం) వరకు మూడు రోజుల పాటు విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రాంపూర్ సర్పంచ్ రడం భరత్ కుమార్ ఆధ్వర్యంలో ఉత్సవ ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయని పేర్కొన్నారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు, విగ్రహ ప్రతిష్ఠాపన జరగనున్నాయి. ఉత్సవాల సందర్భంగా ఆలయానికి విచ్చేసే భక్తుల కోసం ప్రతిరోజూ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కమిటీ సభ్యులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.

