ఆర్టీసీలో ఉద్యోగ భద్రత లేదు
ప్రభుత్వ వైఫల్యమే ఆర్టీసీ డ్రైవర్ మరణానికి కారణం!
రెండున్నర ఏళ్లయినా ప్రభుత్వం ఒక్క హామీ నెరవేర్చలేదు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
దివంగత శంకర్ గౌడ్ కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేత
కాకతీయ, నర్సంపేట టౌన్ : అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, రెండున్నరేళ్లు గడుస్తున్నా వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ప్రభుత్వం మారిన తర్వాత ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోవడం వల్లే తీవ్ర ఆందోళన చెంది, ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ హయాంలో ఆర్టీసీ కార్మికుల ఇబ్బందులను క్యాబినెట్లో చర్చించి, వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే ప్రక్రియను ప్రారంభించామని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఆర్టీసీ కార్మికులెవరూ అధైర్యపడి ప్రాణత్యాగాలకు పాల్పడవద్దని, న్యాయం జరిగే వరకు తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగిన సమయంలోనే శంకర్ గౌడ్ బలవన్మరణానికి పాల్పడటం అత్యంత బాధాకరమన్నారు. ముత్తోజిపేటలో శంకర్ గౌడ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆయన, పార్టీ తరఫున రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేశారు.

అరెస్టులు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధం
బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వచ్చిన బీఆర్ఎస్ నాయకులను ప్రభుత్వం అడ్డుకోవడం, అరెస్టులు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని అరెస్ట్ చేసి, పలు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పడం దురదృష్టకరమని మండిపడ్డారు. ఇలాంటి నిర్బంధాలతో ప్రజా ఉద్యమాలను అణచివేయలేరని స్పష్టం చేశారు. ఈ పరామర్శ కార్యక్రమంలో శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు సిరికొండ మధుసూదనాచారి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, మాజీ ఎంపీ మలోతు కవితతో పాటు పలువురు బీఆర్ఎస్ ముఖ్య నేతలు పాల్గొన్నారు.

