రైతు సంక్షేమమే లక్ష్యంగా సేవలందిస్తాం
వేగవంతం కానున్న మొక్కజొన్న, ధాన్యం కొనుగోళ్లు
పీఏసీఎస్ చైర్మన్ శ్రీనివాసరావు
హైకోర్టు తీర్పు నేపథ్యంలో బాధ్యతలు చేపట్టిన పాత పాలకవర్గం
కాకతీయ, కారేపల్లి: కారేపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్) చైర్మన్‌గా దుగ్గినేని శ్రీనివాసరావు మంగళవారం ఘనంగా బాధ్యతలు స్వీకరించారు. హైకోర్టు తీర్పునకు అనుగుణంగా జిల్లా సొసైటీ పర్సనల్ ఇన్‌ఛార్జి మేరీ కుమారి సమక్షంలో సొసైటీ కార్యాలయంలో ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా నూతన చైర్మన్ దుగ్గినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ.. రైతుల సంక్షేమమే తమ పాలకవర్గం ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు. సొసైటీ ఆధ్వర్యంలో ప్రస్తుతం జరుగుతున్న మొక్కజొన్న, ధాన్యం కొనుగోలు ప్రక్రియలను మరింత వేగవంతం చేసి రైతులకు ఎక్కడా ఇబ్బందులు లేకుండా తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అన్నదాతల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు తాము ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని తెలిపారు. అలాగే రాబోయే వానాకాలం సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని రైతులకు అవసరమైన యూరియా, ఇతర ఎరువులు, నాణ్యమైన విత్తనాలను సకాలంలో అందజేసేలా ముందస్తు చర్యలు తీసుకుంటామని వివరించారు. అందరి సహకారంతో కారేపల్లి సొసైటీ బలోపేతానికి కృషి చేస్తామని, రైతుల విశ్వాసాన్ని నిలబెట్టుకునే విధంగా పారదర్శకంగా సేవలు అందిస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సీఈఓ బొల్లు హనుమంతరావు, డైరెక్టర్లు అడ్డగోడ ఐలయ్య, డేగల ఉపేందర్, సిబ్బంది డి.కృష్ణ, సాంబశివరావు, పాషా తదితరులు పాల్గొని నూతన చైర్మన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

