ఆత్మకూరు కాంగ్రెస్లో అంతర్గత పోరు
పార్టీ మండల అధ్యక్షుడిగా ఇటీవల రేవూరి జలంధర్ రెడ్డి నియామకం
సభ్యత్వం లేని వారికే కీలక బాధ్యతలిస్తారంటూ కొంతమంది ఆగ్రహం
సోషల్ మీడియాలో చర్చకు తెరలేపుతూ.. నిరసన స్వరాలు
కష్టపడ్డ కార్యకర్తల్లో పెల్లుబుకుతున్న తీవ్ర నైరాశ్యం
పదేళ్ల పోరాటానికి ఫలితం దక్కడం లేదంటూ ఆవేదన
బంధుప్రీతి, సామాజిక వివక్షపై శ్రేణుల నిరసన
సమీకరణాలు దెబ్బతింటున్నాయని ఆందోళన
రాష్ట్ర, జిల్లా నాయకత్వ జోక్యం కోరుతున్న కేడర్
కాకతీయ, హన్మకొండ : హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండల కాంగ్రెస్ పార్టీలో పదవుల పంచాయితీ ముదిరింది. ఇటీవల జరిగిన నియామకాలు పార్టీలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి నిర్ణయాలపై పార్టీ శ్రేణులు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. మండల పార్టీ అధ్యక్షుడిగా రేవూరి జలంధర్ రెడ్డిని నియమించడం, జిల్లా కమిటీలో రేవూరి రణధీర్ రెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించడంపై సీనియర్ నాయకులు, కార్యకర్తలు భగ్గుమంటున్నారు. ఈ వ్యవహారం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో పెద్ద చర్చకు దారితీసి, పార్టీ అంతర్గత విభేదాలను బట్టబయలు చేసింది.
త్యాగాలకు దక్కని ఫలితమంటూ ఆవేదన
గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కాంగ్రెస్ జెండా మోసిన కార్యకర్తలను ఇప్పుడు విస్మరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అక్రమ కేసులు, వేధింపులు, బెదిరింపులను ఎదుర్కొని గ్రామ స్థాయిలో పార్టీని కాపాడిన వారిని పక్కన పెట్టి, పార్టీలో చురుకుగా లేని వారికి పదవులు కట్టబెట్టడంపై కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. “ఎన్నికల సమయంలో ఇంటింటికీ తిరిగి ప్రచారం చేసిన మాకు దక్కిన గుర్తింపు ఇదేనా?” అని వారు ప్రశ్నిస్తున్నారు.
సభ్యత్వం లేని వారికి పట్టం?
జిల్లా స్థాయిలో పదవి పొందిన రేవూరి రణధీర్ రెడ్డికి అసలు పార్టీలో ప్రాథమిక సభ్యత్వం కూడా లేదనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. పార్టీ అధికారిక కార్యక్రమాల్లో ఏనాడూ పాల్గొనని వ్యక్తికి కీలక బాధ్యతలు ఇవ్వడం వెనుక కేవలం బంధుప్రీతి ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి తన సొంత వర్గానికి, బంధువులకే ప్రాధాన్యం ఇస్తున్నారని, కష్టపడిన బహుజన వర్గాల నాయకులను విస్మరిస్తున్నారని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. మండల, జిల్లా స్థాయి నియామకాల్లో సామాజిక సమతౌల్యం పూర్తిగా లోపించిందని కార్యకర్తలు ధ్వజమెత్తుతున్నారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతమైన సామాజిక న్యాయం ఆత్మకూరులో అమలు కావడం లేదని, అగ్రవర్ణాలకు ఒక న్యాయం, బహుజనులకు మరో న్యాయమా అని నిలదీస్తున్నారు. ఈ పరిణామాలతో పార్టీ రెండు వర్గాలుగా విడిపోయే పరిస్థితి కనిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ అంతర్గత కుమ్ములాటలు పార్టీ మనుగడకు చేటు తెస్తాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆత్మకూరు కాంగ్రెస్లో సెగలు రేపుతున్న ఈ అసంతృప్తిపై జిల్లా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రాంరెడ్డి తక్షణమే స్పందించాలని కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. పదవుల కేటాయింపును పునర్విమర్శించి, నిజాయితీగా పనిచేసిన వారికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు. లేనిపక్షంలో భవిష్యత్తులో గ్రామ స్థాయిలో పార్టీ తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

