హజ్ యాత్రికులపై ఆర్థిక భారం పడనీయం
విమాన ఛార్జీల పెరుగుదల భారాన్ని ప్రభుత్వమే భరిస్తుంది
నగరంలోని ఆటోలకు ఉచితంగా ‘ఈవీ’ రెట్రో ఫిట్టింగ్
అభివృద్ధి, సంక్షేమంలో మైనారిటీలకు సముచిత వాటా
హజ్ బస్సుల ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
కాకతీయ,తెలంగాణ బ్యూరో : మైనారిటీల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అభివృద్ధిలో వారికి దక్కాల్సిన వాటాను నిరంతరం అందిస్తామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నాంపల్లి హజ్ హౌస్‌లో శుక్రవారం హజ్ యాత్రికుల బస్సులను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి, జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. అంతర్జాతీయ పరిస్థితుల రీత్యా పెరిగిన ప్రయాణ ఛార్జీల భారాన్ని యాత్రికులపై పడకుండా ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. ఇరాన్, ఇరాక్ యుద్ధ వాతావరణం కారణంగా విమాన ఇంధన ధరలు పెరిగి ప్రయాణం భారమైందని, అయినప్పటికీ మైనారిటీ సోదరుల సౌకర్యార్థం ఆ భారాన్ని తెలంగాణ ప్రభుత్వం తన భుజాన వేసుకుందని వెల్లడించారు.

ఆటో డ్రైవర్లకు అండ.. యువతకు నైపుణ్యం
హైదరాబాద్ నగరంలో అధిక సంఖ్యలో మైనారిటీ సోదరులు ఆటోలు నడుపుతూ జీవనం సాగిస్తున్నారని, వారి ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని సీఎం తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల నడిచే అన్ని ఆటోలకు ఉచితంగా ‘రెట్రో ఫిట్టింగ్’ చేసి, వాటిని ఈవీ (ఎలక్ట్రిక్) ఆటోలుగా మార్చాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. దీనివల్ల ఇంధన ఖర్చులు ఆదా అయి ఆటో డ్రైవర్ల ఆదాయం పెరుగుతుందన్నారు. ప్రస్తుత కాలంలో వైట్ కాలర్ ఉద్యోగాల కంటే బ్లూ కాలర్ జాబ్స్‌కు డిమాండ్ ఎక్కువగా ఉందని, జర్మనీ, జపాన్ వంటి దేశాల్లో ఉన్న అవకాశాలను యువత అందుకునేలా ఐటీఐలను ఏటీసీలుగా అప్‌గ్రేడ్ చేసి నైపుణ్య శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. విదేశీ విద్యను అభ్యసించే మైనారిటీ విద్యార్థులకు కూడా స్కాలర్‌షిప్‌లు అందజేస్తున్నట్లు గుర్తుచేశారు.
మానవీయతతో సాయం.. ఐక్యతకు పిలుపు
గత ఏడాది హజ్ యాత్రలో జరిగిన బస్సు ప్రమాదంలో 44 మంది మరణించగా, మానవీయ కోణంలో స్పందించిన తమ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం అందించి ఆదుకుందని ముఖ్యమంత్రి వివరించారు. రాష్ట్రంలో హిందూ, ముస్లిం భేదాభిప్రాయం లేదని.. అందరూ ‘భాయీ-భాయీ’గా మెలుగుతూ అభివృద్ధిలో తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలపాలని పిలుపునిచ్చారు. ఇదే సమయంలో ‘SIR’ పేరుతో రాష్ట్రంలో ఓట్లు తొలగించే కుట్రలు జరుగుతున్నాయని, ఇతర రాష్ట్రాల్లో జరిగినట్లు ఇక్కడ జరగనివ్వకుండా అందరం కలిసికట్టుగా అడ్డుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్, ఎమ్మెల్సీ మీర్జా రియాజ్, వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుస్సేనీ తదితరులు పాల్గొన్నారు.

