విద్యా వారోత్సవాలను విజయవంతం చేయాలి
ఎంఈఓ ఆంగోత్ రాందాస్
కాకతీయ, నెల్లికుదురు : ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా ఈ నెల 11 నుండి 17వ తేదీ వరకు నిర్వహించనున్న ‘ప్రత్యేక విద్యా వారోత్సవాలను’ విజయవంతం చేయాలని మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ) ఆంగోత్ రాందాస్ పిలుపునిచ్చారు. శనివారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపు, పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా ఈ వారోత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మరియు ఉపాధ్యాయులు ఈ వారోత్సవాల్లో చురుగ్గా పాల్గొని విజయవంతం చేయాలని రాందాస్ ఆదేశించారు. విద్యా విజయోత్సవంతో ముగిసే ఈ కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ పాఠశాలల ప్రాముఖ్యతను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇంచార్జీ హెచ్ఎం జీవన్ కుమార్, ఎంఐఎస్ కో-ఆర్డినేటర్ మస్కరపురి సుధాకర్, సీఆర్పీలు ఎ.భాస్కర్రావు, బి.వీరస్వామి, బి.కవిత, జె.కవిత మరియు వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

