రాజకీయ దిగ్గజాలతో విజయ్ వరుస భేటీలు
మాజీ సీఎం స్టాలిన్, వైకో, సీమాన్‌లతో మర్యాదపూర్వక సమావేశం
అందరినీ కలుపుకుని పోయే దిశగా అడుగులు
కాకతీయ, నేషనల్ డెస్క్ : తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నటుడు, రాజకీయ నాయకుడు విజయ్.. పాలనలో తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమయ్యారు. నిన్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం, నేడు ఆయన రాష్ట్రంలోని పలువురు రాజకీయ దిగ్గజాలను మర్యాదపూర్వకగా కలిశారు. ఈ భేటీలు ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి.
పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే విజయ్.. మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్, సీనియర్ నేతలు వైకో, అన్బుమణి రామదాస్, మరియు నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ వంటి ప్రముఖులను కలిశారు. తన రాజకీయ ప్రయాణంలో అందరి సలహాలు, సూచనలు తీసుకుంటూ, అన్ని పార్టీలతో సమన్వయంతో ముందుకు వెళ్తామనే స్పష్టమైన సంకేతాలను ఆయన ఈ సందర్భంగా ఇచ్చారు. రాజకీయాల్లోకి రాకముందే భారీ అభిమాన గణాన్ని సంపాదించుకున్న విజయ్, ఇప్పుడు అధికారం చేపట్టాక హుందాగా వ్యవహరిస్తున్న తీరుపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా, పాత విభేదాలను పక్కన పెట్టి రాష్ట్ర అభివృద్ధి కోసం అందరినీ కలుపుకుని పోవాలనే ఆయన నిర్ణయాన్ని రాజకీయ విశ్లేషకులు స్వాగతిస్తున్నారు. విజయ్ సారథ్యంలో తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైందని ఆయన మద్దతుదారులు భావిస్తున్నారు.


