రౌడీషీటర్లు సత్ప్రవర్తనతో మెలగాలి
వరంగల్ ఈస్ట్ జోన్ డిసిపి అంకిత్ కుమార్
సుగొండ ఠాణాలో రౌడీషీటర్లకు డీసీపీ కౌన్సెలింగ్
కాకతీయ, గీసుగొండ : సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు దూరంగా ఉంటూ రౌడీషీటర్లు సత్ప్రవర్తనతో మెలగాలని ఈస్ట్ జోన్ డిసిపి అంకిత్ కుమార్ సూచించారు.శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా గీసుగొండ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన ప్రత్యేక కౌన్సెలింగ్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ప్రజలను భయభ్రాంతులకు గురిచేయకుండా చట్టాలను గౌరవిస్తూ బాధ్యతాయుతంగా జీవించాలని రౌడీషీటర్లకు సూచించారు.ఈ సందర్భంగా గొడవలు, బెదిరింపులు,దౌర్జన్యా లకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.మద్యం,జూదం, అక్రమ వసూళ్లు వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొనరాదని తెలిపారు.గ్రామాల్లో ఏదైనా నేరం జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, మహిళలు మరియు చిన్నపిల్లలతో మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు. తమపై నమోదైన కేసుల విషయంలో కోర్టుకు తప్పనిసరిగా హాజరు కావాలని, భూ వివాదాలలో జోక్యం చేసుకుని బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.గీసుగొండ, మామునూరు,ఎనమాముల, ఐనవోలు,పర్వతగిరి పోలీస్ స్టేషన్ల పరిధిలోని మొత్తం 33 మంది రౌడీషీటర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో మామునూరు ఏసిపి వెంకటేష్, గీసుగొండ ఇన్స్పెక్టర్ విశ్వేశ్వర్, ఎనమాముల ఇన్స్పెక్టర్ సురేష్,మామునూరు ఇన్స్పెక్టర్ శ్రీనివాస్,ఎస్ఐలు వంశీకృష్ణ, కుమార్,తాహెర్ తదితరులు పాల్గొన్నారు.

