‘మోడల్ యునైటెడ్ నేషన్స్’కు సిరివెన్నెల ఎంపిక
అంతర్జాతీయ వేదికపై నెల్లికుదురు విద్యార్థిని ప్రతిభ
వివిధ దేశాల ప్రతినిధిగా ప్రపంచాంశాలపై ప్రసంగం
కాకతీయ, నెల్లికుదురు: హైదరాబాద్‌లోని టీజీఐఆర్డీ వేదికగా మే 15 నుంచి 17 వరకు నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక ‘మోడల్ యునైటెడ్ నేషన్స్స కార్యక్రమానికి నెల్లికుదురు మండలం పీఎం శ్రీ మోడల్ పాఠశాల విద్యార్థిని సిరివెన్నెల ఎంపికై తన ప్రతిభను చాటుకుంది. మహబూబాబాద్ జిల్లా నుంచి మొత్తం ఏడుగురు విద్యార్థులు ఈ అంతర్జాతీయ స్థాయి వేదికకు ఎంపిక కాగా, అందులో నెల్లికుదురు పాఠశాల నుంచి సిరివెన్నెలకు చోటు దక్కడం విశేషం. ఈ కార్యక్రమ వివరాలను విద్యార్థుల కోఆర్డినేషన్ ఆర్గనైజర్, సోషల్ ఉపాధ్యాయిని అంజుమ్ సుల్తానా వెల్లడించారు. ఈ వేదికపై విద్యార్థులు జపాన్, మెక్సికో, మలేషియా వంటి వివిధ దేశాలకు రాయబారులుగా ప్రాతినిధ్యం వహించనున్నారు. ముఖ్యంగా యూనిసెఫ్ వంటి అంతర్జాతీయ సంస్థల పనితీరు, ప్రస్తుత ప్రపంచ సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై సిరివెన్నెల తన వక్తృత్వ నైపుణ్యాలను ప్రదర్శించనుంది.
నాయకత్వ లక్షణాలకు నాంది
ఈ సందర్భంగా తెలంగాణ స్టేట్ సోషల్ ఫోరం ప్రతినిధులు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్, సమగ్ర శిక్ష జాయింట్ డైరెక్టర్ నర్సమ్మ, జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణ మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపేందర్ రావులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థినిని ప్రోత్సహించిన ఉపాధ్యాయిని అంజుమ్ సుల్తానాను ఈ సందర్భంగా అభినందించారు. ఇటువంటి అంతర్జాతీయ కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, ప్రపంచ అంశాలపై అవగాహన పెరుగుతుందని సోషల్ ఫోరం ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.

