కాంగ్రెస్లో చేరిన మాజీ ఎంపీపీ సింగిరెడ్డి
కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి
కాకతీయ, ఇల్లంతకుంట : రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో బీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. మండలంలోని గాలిపల్లి గ్రామానికి చెందిన సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీపీ సింగిరెడ్డి సుధాకర్ రెడ్డి శుక్రవారం బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మానకొండూర్ శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసిన సుధాకర్ రెడ్డి, ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు వెల్లడించారు. గతంలో మండల ఎంపీపీగా సేవలందించిన అనుభవజ్ఞుడైన సుధాకర్ రెడ్డి చేరికతో మండలంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు, ముస్కానిపేట సర్పంచ్ కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి, మాజీ ఎంపీపీలు ఉట్కూరి వెంకట రమణారెడ్డి, గుడిసె ఐలయ్య మరియు వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు.

